నేషనల్ గేమ్స్‌లో తెలంగాణకు తొలి మెడల్ సిల్వర్ మెడల్ లభించింది. మహిళల తైక్వాండోలో పాయం హర్షప్రద రజత పతకం సాధించింది. డెహ్రాడూన్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో శుక్రవారం ముగిసిన తైక్వాండో 73 కిలోల కియోర్గి విభాగం ఫైనల్లో చండీగఢ్ అమ్మాయి ఇతీషా దాస్ 2-0తో తెలంగాణ ప్లేయర్‌ను ఓడించింది. దాంతో హర్షప్రద రన్నరప్‌గా నిలిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఉత్తరాఖండ్ ప్లేయర్‌పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. రజత పతకం సాధించిన హర్షప్రదను తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షుడు డి.సతీష్ గౌడ్, సాట్స్ ఛైర్మెన్ శివసేనారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పతకాల పట్టికలో తెలంగాణ ప్రస్తుతం ఒక స్వర్ణం సహా మొత్తం ఆరు పతకాలతో 28వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాలతో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో కొనసాగుతోంది. 38 స్వర్ణాలతో సహా 64 పతకాలతో సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అగ్రస్థానంలో ఉండగా.. 30 స్వర్ణాలతో కర్ణాటక, 21 స్వర్ణాలతో మధ్యప్రదేశ్, 19 స్వర్ణాలతో హర్యానా టాప్-5లో కొనసాగుతున్నాయి.

ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ స్వర్ణ పతకం సాధించింది. శుక్రవారం జరిగిన మహిళల 75 కేజీల విభాగం ఫైనల్లో లవ్లీనా 5-0తో ప్రన్షు రాథోడ్(చండీగఢ్)ను ఓడించింది.