భారత జావెలిన్ త్రోయర్, గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవిపై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అమ్మ ప్రేమ అంటే అట్లుంటదని కొనియాడాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రజత పతకం గెలవగా.. పాకిస్థాన్ బళ్లెం వీరుడు అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.
ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్.. ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. మరోవైపు నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ 2020 కంటే మెరుగైన ప్రదర్శన చేసినా అర్షద్ నదీమ్‌ను ధాటలేకపోయాడు. ఈటెను 89.45 మీటర్లు మాత్రమే విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సారి గోల్డ్ మెడల్ సాధించనందుకు తనను క్షమించాలని భారత ప్రజలను కోరాడు.

మరోవైపు నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి మాత్రం.. బంగారు పతకం గెలిచిన అర్షద్ నదీమ్ కూడా తన కొడుకేనని చెప్పింది. వారిద్దరూ పోటీపడుతుంటే చూడముచ్చటంగా ఉందని తన ప్రేమను చాటుకుంది.
సరోజ్ దేవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమెపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. తాజాగా సరోజ్ దేవి వ్యాఖ్యలను షోయబ్ అక్తర్ కొనియాడాడు. ఇలా చెప్పడం ఒక తల్లికి మాత్రమే సాధ్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. 'ఎవరో స్వర్ణ పతకం సాధిస్తే.. అతను కూడా మా కుమారుడే అని ఆమె చెప్పారు. ఇలా చెప్పడం ఒక తల్లికి మాత్రమే సాధ్యం. నిజంగా ఇదొక అద్భుతం'అని ఎక్స్‌లో షోయబ్ అక్తర్ రాసుకొచ్చాడు.
పాకిస్థాన్ తరఫున వ్యక్తిగత గోల్డ్ సాధించిన తొలి అథ్లెట్‌గా అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్ మెడల్ అందించాడు. 1992 ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ చివరిసారిగా మెడల్ సాధించింది. ప్రస్తుతం అర్షద్ నదీమ్ పాకిస్థాన్‌లో హీరోగా మారిపోయాడు. అతనిపై రివార్డుల వర్షం కురుస్తోంది.
భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకునే పాకిస్థాన్ ఆటగాళ్లలో షోయబ్ అక్తర్ ముందుంటాడు. ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మెరుగుపర్చాలని అతను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అక్తర్ ఏనాడు కూడా భారత్‌పై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయలేదు.