
మూడో ప్రయత్నంలో..
తొలి, రెండో ప్రయత్నంలో ఆమె 6.34 మీ. దూరాన్ని నమోదు చేసింది. రెండో ప్రయత్నం ముగిసే సరికి హొరియెలొవా (6.50 మీ.; ఉక్రెయిన్) ఆధిక్యంలో నిలువగా, ఎబొసెలె (6.46మీ.; స్పెయిన్), శైలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మూడో ప్రయత్నం (6.59 మీ.) శైలీని స్వర్ణావకాశానికి దగ్గర చేసింది. అప్పటికి అస్కగ్ (6.44 మీ.) పతకం బరిలోకి రానేలేదు. కానీ నాలుగో ప్రయత్నం అస్కగ్ (6.60 మీ.)ను చాంపియన్‌గా చేస్తే, భారత అథ్లెట్ 4, 5 ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. ఆఖరి ఆరో ప్రయత్నం సఫలమైనా... 6.37 మీటర్ల దూరమే దూకింది. దీంతో చివరకు రజతమే ఖాయమైంది. ఉక్రెయిన్ అథ్లెట్ మరియా హొరియెలొవా (6.50 మీ.) కాంస్యం గెలిచింది.

మా అమ్మ చెప్పింది..
తాను బంగారు పతకం నెగ్గాలని, స్టేడియంలో మన జాతీయ గీతం వినిపించాలని టోర్నీకి వచ్చే ముందు తన తల్లి చెప్పిందని, ఆమె కోరికను నెరవేర్చలేకపోయానని 17 ఏళ్ల శైలి బాధపడింది. 'నేను 6.59 మీటర్ల తర్వాత ఇంకాస్త దూరాన్ని నమోదు చేయాల్సింది. స్వర్ణం గెలిచే అవకాశాలు ఇంకా మూడు ప్రయత్నాల రూపంలో ఉన్నా... అనుకున్నది సాధించలేకపోయాను. నా తల్లి పసిడిపైనే కన్నేయాలి. జాతీయ గీతాన్ని వినిపించాలని చెప్పింది. అలా కుదరకపోవడం నన్ను బాధించింది. నాకు ఇంకా 17 ఏళ్లే. మరో జూనియర్ ఈవెంట్‌లో తలపడే అవకాశం ఉంది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ కూడా జరగనుండటంతో మరింత మెరుగైన ప్రదర్శనతో స్వర్ణ కలను సాకారం చేసుకుంటా'అని షైలి చెప్పుకొచ్చింది.

టెక్నికల్ సమస్యలు..
కాగా ల్యాండింగ్ టైమ్‌లో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, లేదంటే షైలీ కచ్చితంగా గోల్డ్ నెగ్గేదని ఆమె కోచ్ బాబీ జార్జ్ అభిప్రాయపడ్డాడు. ఉత్తర ప్రదేశ్ ఝూన్సి సిటీకి చెందిన షైలీని లెజెండరీ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్ వారుసురాలిగా పరిగణినిస్తున్నారు. షైలీకి తండ్రి లేడు. ఆమె తల్లి టైలర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని అంజూ జార్జ్ అకాడమీలోనే షైలీ ట్రెయినింగ్ తీసుకుంటోంది..

మహిళల రిలేలో నాలుగో స్థానం
తెలుగమ్మాయి కుంజా రజిత భాగంగా ఉన్న 4 X 400 మీటర్ల రిలేలో భారత జట్టుకు నాలుగో స్థానం దక్కింది. మహిళల ఫైనల్లో రజిత, ప్రియా మోహన్, పాయల్ వోహ్రా, సమ్మీలతో కూడిన జట్టు పోటీని 3 నిమిషాల 40.45 సెకన్లలో పూర్తి చేసింది. ఇందులో నైజీరియా అమ్మాయిలు 3 ని.31.46 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలిస్తే, జమైకా జట్టు (3ని.36.57 సె.) రజతం, ఇటలీ బృందం (3ని.37.18 సె.) కాంస్యం గెలుపొందింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో స్వల్పతేడాతో భారత అథ్లెట్ డొనాల్డ్ మకిమయిరాజ్ (15.82 మీ.) కాంస్య పతకం కోల్పోయాడు.

మూడు పతకాలతో ముగింపు..
ఇతని కంటే మూడు సె.మీ.దూరం దూకిన సైమన్ గోర్ (15.85 మీ.; ఫ్రాన్స్)కు కాంస్యం లభించగా, మకిమయిరాజ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇందులో గాబ్రియెల్ (16.43 మీ.; స్వీడెన్), హిబెర్ట్ (16.05 మీ.; జమైకా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మహిళల 5000 మీ. ఫైనల్లో అంకిత నిరాశపరిచింది. పది మంది పాల్గొన్న ఈ ఈవెంట్‌లో ఆమె (17 ని.17.68 సెకన్లు) ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 1 రజతం, 2 కాంస్యాలతో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలను ముగించింది.


Click it and Unblock the Notifications
