ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే గానీ.. ఊరికి రోడ్డు వేయలేదు: లవ్లీనా స్వగ్రామం దుస్థితి

గువాహటి: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని అందుకుంది. మరో మెడల్‌ను ముద్దాడింది. మహిళల బాక్సింగ్‌లో భారత్ ఈ ఘనతను సాధించింది. మహిళల 64-69 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ కేటగిరీలో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నలవ్లీనా బొర్గోహెయిన్ ఈ ఘనతను సాధించారు. ఒలింపిక్స్‌లో అడుగు పెట్టడంతోనే పతకాన్ని అందుకున్న యువతిగా రికార్డు సృష్టించారు. సెమీ ఫైనల్స్‌లో లవ్లీనా ఓడిపోవడం నిరుత్సాహ పరిచినప్పటికీ.. అప్పటికే ఆమెకు మెడల్ ఖాయం కావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి.

మారిన స్వగ్రామం రూపురేఖలు
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత.. ఆమె స్వగ్రామం రూపు రేఖలు మారిపోయాయి. అస్సాం గోలాఘాట్ జిల్లాలోని బారాముఖియా ఆమె స్వగ్రామం. అప్పర్ అస్సాం బర్బథార్ టౌన్‌కు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటందీ కుగ్రామం. సుమారు రెండువేల మంది వరకు జనాభా ఉంటుందక్కడ. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బిశ్వజిత్ ఫుకన్ ఎనికయ్యారు. ఎలాంటి ఆదరణకు నోచుకోని చిన్న పల్లెటూరు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఊరు.
ఎన్నో ఏళ్లుగా
ఇప్పుడు ఆ ఊరి రూపురేఖలే మారిపోతోన్నాయి. లవ్లీనా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న వెంటనే- ఆ గ్రామానికి యుద్ధ ప్రాతిపదికన రోడ్డును మంజూరు చేసింది అక్కడి ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు సాగుతున్నాయి. తమ గ్రామానికి రోడ్డు వేయాలంటూ ఎన్నో ఏళ్లుగా అధికారుల వద్ద మొరపెట్టుకుంటోన్నారు బారాముఖియా గ్రామస్తులు. ఏ నాడు కూడా వారి బాధలను ఆలకించలేదు. చినుకు పడితే చిత్తడిగా మారిపోయే కచ్చా రోడ్డు మీదే కొన్నేళ్లుగా రాకపోకలు సాగించారు.

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు..
లవ్లీనా బొర్గోహెయిన్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఇదే రోడ్డు మీద ఆమె రాకపోకలు సాగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకోవడంతో అధికారులు కళ్లు తెరచుకున్నారు. అప్పటికప్పుడు రోడ్డును మంజూరు చేశారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతోన్నాయి. టోక్యో నుంచి లవ్లీనా.. తన స్వగ్రామానికి చేరుకునే సమయానికి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తోన్నారు స్థానిక అధికారులు. కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదని, లవ్లీనా పతకం గెలవడంతో యుద్ధ ప్రాతిపదికన దాన్ని వేస్తోన్నారంటూ స్థానికులు చెబుతున్నారు.

గెలుస్తారని ఆశించినా..
కాగా- టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 64-69 కేజీల వెల్టర్ వెయిట్ సెమీ ఫైనల్‌లో లవ్లీనా బొర్గొహెయిన్ ఓడిపోయారు. అయినప్పటికీ.. క్వార్టర్ ఫైనల్స్‌లో సాధించిన విజయంతో ఆమెకు కాంస్య పతకం ఖాయమైన విషయం తెలిసిందే. బాక్సింగ్ విభాగంలో ఈ ఘనతను అందుకున్న మూడో భారత బాక్సర్‌గా నిలిచారు. సెమీ ఫైనల‌్‌లో 0-5 తేడాతో టర్కీ బాక్సర్, వరల్డ్ చాంపియన్ సుర్మెనెలి బుసెనాజ్ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. దీనితో తనకు లభించిన కాంస్య పతకాన్ని రజతం లేదా స్వర్ణంగా మార్చుకుంటారని ఆశించినప్పటికీ.. నిరాశే ఎదురైంది.
దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు..
కాంస్య పతకాన్ని సొంతం చేసుకోవడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్రమంత్రులు ఆమెను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్ చేసి, ప్రశంసల వర్షాన్ని కురిపించారు. బారాముఖియా గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. గ్రామస్తులు బాణాసంచా కాల్చి వేడుక జరుపుకొంటున్నారు. అదే సమయంలో తమ గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతోండటం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications