
ఢిల్లీ: ఎన్నో ఏళ్ల కల.. నిజమైన వేళ యావత్ భారతావని మురిసిపోతోంది. శనివారం టోక్యో వేదికగా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా పసిడి పతకంతో ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. శనివారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణంతో జపాన్ గడ్డపై మువన్నెల జెండాను రెపరెపలాడించాడు. ఫలితంగా 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డుకెక్కాడు. ఓవరాల్‌గా లెజండరీ షూటర్ అభినవ్ బింద్రా(2008 ఒలింపిక్స్) తర్వాత మెగా గేమ్స్‌లో గోల్డ్ నెగ్గిన రెండో భారతీయుడిగా నిలిచాడు. దాంతో యావత్ భారతావణి నీరజ్‌కు నీరాజనాలు పలుకుతుంది.
ఈ నేపథ్యంలోనే భారత పరుగుల రాణి పీటీ ఉష నీరజ్ చోప్రా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ట్విటర్ వేదికగా ఈ బల్లెం వీరుడిని అభినందించింది. '37 ఏళ్ల కిందట నెరవేరకుండా ఉండిపోయిన నా కల ఇప్పుడు నెరవేరింది. థ్యాంక్యూ మై సన్ నీరజ్ చోప్రా'అని అతనితో దిగిన పాత ఫొటోను షేర్ చేసింది. కాగా 'పయ్యోలి ఎక్స్‌ప్రెస్','పరుగుల రాణిగా'గుర్తింపు పొందిన పీటీ ఉష.. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని కోల్పోయింది. ఆ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో పోటీ పడిన ఈ పరుగుల దిగ్గజం సెకనులో వందో వంతు తేడాలో కాంస్య పతకం చేజార్చుకుంది.
పీటీ ఉష 400 మీ హార్డిల్స్‌ను 55. 42 సెకన్లలో పూర్తి చేయగా.. రోమానియాకు చెందిన క్రిస్టియానా కోజోకారు 55.41 సెకన్లలో రేసును పూర్తి చేయడంతో ఆమెకు కాంస్యం దక్కింది. నిజానికి 1984 గేమ్స్‌కు ముందు ఉష టాప్ ఫామ్‌లో ఉంది. 1982లో ఏషియన్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల స్ప్రింట్‌లో సిల్వర్ మెడల్స్ గెలిచింది. తర్వాతి ఏడాది ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో 400 మీటర్లలో ఏకంగా గోల్డ్ సాధించింది. ఆ తర్వాత 400 మీటర్ల హర్డిల్స్‌పై దృష్టి సారించి 1984 గేమ్స్‌లో మెడల్‌పై ఆశలు రేపినప్పటికీ అందుకోలేకపోయింది.
అలా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు పతకం అందించాలనేది పీటీ ఉషకు కలగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని పీటీ ఉష స్వయంగా చాలా ఇంటర్య్వూల్లో పేర్కొంది. అయితే ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా మాత్రం పీటీ ఉష రికార్డు పదిలంగా ఉంది. ఆ తర్వాత 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలతో పాటు రజతం సాధించింది. 1990 ఆసియాడ్ లో 3 రజతాలు, 1994 ఆసియాడ్‌లో ఒక రజత పతకాన్ని సాధించింది.
టోక్యో ఒలింపిక్స్‌తో తాను సాధించిన స్వర్ణాన్ని నీరజ్ చోప్రా స్ప్రింట్ లెజెండ్ మిల్కా సింగ్‌కు అంతితమిచ్చాడు. 'ఈ స్టేడియంలో జాతీయ గీతాన్ని వినాలని మిల్కా కోరుకున్నారు. కానీ ఆయన మన మధ్య లేరు. అయినప్పటికీ ఆయన కల నెవరేరింది'అని నీరజ్ ట్వీట్ చేశాడు. దీనిపై మిల్కా ఫ్యామిలీ ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'ఈ వైభవం కోసం నాన్న చాలా ఏళ్లు ఎదురు చూశాడు. చివరకు ఆ కల నెరవేరింది. నీరజ్ ట్వీట్‌ను చూసి నేనే ఏడ్చేశా. పై నుంచి నాన్న కూడా ఏడ్చేసి ఉంటాడు. మమ్మల్ని సంతోషంగా ఉంచినందుకు అందరికి థ్యాంక్స్'అని మిల్కా కొడుకు జీవ్ పేర్కొన్నాడు.
మిల్కా సింగ్ రెండు నెలల క్రితం కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మిల్కా ఆసియా అథ్లెటిక్స్‌లో నాలుగుసార్లు స్వర్ణం నెగ్గారు. 1958 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్ 400 మీటర్ల పరుగులో త్రుటిలో పతకం కోల్పోయారు.