ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నూతన సీఈఓగా రఘు అయ్యర్ నియామకంపై కొనసాగుతున్న వివాదంపై ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష స్పందించారు. సీఈఓ నియామకంపై ఎగ్జిక్యూటీవ్ కమిటీ(ఈసీ) అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం నెలకొందని తెలిపారు.
కొత్త సీఈఓ నియామకం వ్యవహారంలో పీటీ ఉషకు 12 మంది ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులతో పాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ పటేల్ వ్యతిరేకంగా నిలిచారు. ఆర్‌పీ సంజీవ్ గోయెంకా(ఆర్‌పీఎస్‌జీ) గ్రూప్ మాజీ సీఈఓ రఘు అయ్యర్‌ను ఐఓఏ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ నూతన సీఈఓగా నియమించింది.

అయితే పీటీ ఉష, ఈసీ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఈ నియామకం ఇంకా ఖరారు కాలేదు. రఘు అయ్యర్‌కు నెలకు రూ. 20 లక్షల జీతం ఇవ్వడాన్ని ఈసీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై శుక్రవారం మైఖేల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన పీటీ ఉష.. గురువారం జరిగిన ఐఓఏ ఎగ్జిక్యూటీవ్ కమిటీ(ఈసీ) సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
'ఐఓఏ కొత్త రాజ్యాంగం ప్రకారం నూతన సీఈఓను రెండు నెలల్లో నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితమైన ప్రమాణాలు పాటించాలని అందులో ప్రస్తావించారు. ఐఓఏ సీఈవోగా బాధ్యతలు చేపట్టే వారికి 10 ఏళ్ల అనుభవంతో పాటు రూ.25 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీల్లో పని చేసి ఉండాలి.
సీఈఓ స్థానాన్ని భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభంలో చాలా మంది దరఖాస్తులను పరిశీలించలేదు. ఇది ఎగ్జిక్యూటీవ్ కమిటీ(ఈసీ) సభ్యుల్లో అసంతృప్తికి దారి తీసింది. దాంతో కొందరు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)ని సంప్రదించకుండా ఈ నియామక ప్రక్రియను వాయిదా వేయాలని లేదా రాజ్యాంగాన్ని మార్చాలని సూచించారు.
ఈ వ్యవహారం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)తో పాటు భారత ప్రధాన కార్యాలయం దృష్టికి వెళ్లింది. దాంతో సీఈఓ నియామకం కోసం ఐఓఏ మళ్లీ ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారదర్శక ఎంపిక ప్రక్రియతో 11 మంది దరఖాస్తుల నుంచి రఘు అయ్యర్‌ను ఐఓఏ నూతన సీఈఓగా ఎంపిక చేశాం. అయితే అతని నియామకాన్ని ఈసీ సభ్యులు వ్యతిరేకించారు. ముఖ్యంగా ఆయన జీతంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
10 మంది సభ్యులు హాజరైన ఈసీ సమావేశంలో అయ్యర్ నియామకాన్ని ఆమోదించవద్దని ఏక గ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అయ్యర్ జీతంపై పున:సమీక్ష చేద్దామని చెప్పినా వారు వినలేదు. అభ్యర్థులకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ ఎంపిక ప్రక్రియను మళ్లీ చేపట్టాలని డిమాండ్ చేశారు. వారికి సర్థి చెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఈ వివాదం కారణంగా ఐఓఏ ప్రతిష్ట దిగజారుతుంది.'అని పీటీ ఉష ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసీ సమావేశంలో సభ్యుల నుంచి మద్దతు లభించకపోవడంతో తాను అక్కడి నుంచి వచ్చేసానని, ఈ భేటీలో పారదర్శకత లోపించిందని పీటీ ఉష విచారం వ్యక్తం చేశారు.