పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హత వేటుకు గురవ్వడంతో భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)తో పాటు వైద్య బృందంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసిన వినేష్ ఫోగట్.. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో డిస్‌క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.
దాంతో నిబంధనల ప్రకారం ఆమె ఏ పతకాన్ని అందుకోలేకపోయింది. ఈ వ్యవహారంపై భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు ముగియగా.. ఆగస్ట్ 13న తుది తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు.

వినేష్ ఫోగట్‌దే తప్పు..
వినేష్ ఫోగట్ వ్యవహారంలో ఐఓఏ వైద్య బృందం తప్పిదం ఏ మాత్రం లేదన్నారు. వినేష్ ఫోగట్‌తో పాటు ఆమె వ్యక్తిగత కోచ్‌లు, సిబ్బంది చేసిన తప్పిదం కారణంగానే ఈ సమస్య ఏర్పడిందని పేర్కొంది. ఐఓఏ వైద్య బృందం ఆటగాళ్ల గాయాల నుంచి కోలుకొనేలా చేయడంతో పాటు ఇంజూరీ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తుందని, ఆటగాళ్ల బరువు పెరగడం, తగ్గడం వారికి సంబంధం లేని వ్యవహారమని స్పష్టం చేసింది.
ఐఓఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలపై వచ్చిన విమర్శలను ఆమె తప్పుబట్టారు. 'రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి వెయిట్ కేటగిరి సంబంధించి క్రీడల్లో అథ్లెట్లు, కోచ్‌లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. బరువు, ఫిట్‌నెస్ తదితర అంశాల్లో వారిదే పూర్తి బాధ్యత. ఇందులో ఐఓఏ మెడికల్ టీమ్ చేసేదేమీ ఉండదు.
క్రీడాకారులకు గాయమైతే దానిని త్వరగా తగ్గించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. అంతేకానీ, అథ్లెట్ల బరువు అంశంలో భారత ఒలింపిక్ సంఘం నియమించిన వైద్య బృందం ఏం చేయలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతీ అథ్లెట్‌కు సొంత సపోర్ట్ టీమ్ ఉంది. ఫిట్‌నెస్, బరువు, డైట్ వంటి వ్యవహారాలు అన్నీ వారే చూసుకోవాలి. అథ్లెట్ల విషయం లో వారిదే పూర్తి బాధ్యత.
న్యాయం జరుగుతోంది..
వినేష్ ఫోగట్ అంశం మమ్మల్ని బాధపెట్టింది. ఐఓఏ మెడికల్ టీమ్‌పై విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదు. డాక్టర్ పార్టివాలాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం మంచిది కాదు. ఈ ట్రోల్స్, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో మనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే వాదనలు ముగిసాయి. తుది తీర్పు ఆగస్ట్ 13 సాయంత్రం 6 గంటల్లోపు వచ్చే అవకాశం ఉంది.'అని పీటీ ఉష.. ఐఓఏ తరఫున ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారమే ఆడి ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇవ్వాలని ఐఓఏ డిమాండ్ చేస్తోంది. తుది తీర్పు వచ్చే ముందు పీటీ ఉష వినేష్ ఫోగట్‌దే తప్పు అంటూ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.