
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 36వ నేషనల్ గేమ్స్‌ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం జాతీయ క్రీడలనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో మన అథ్లెట్లు వందలోపు ఈవెంట్లలోనే పాల్గొనేవారని, ఇప్పుడు 300కు పైగా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటున్నారని చెప్పారు.
ఈ ప్రారంభ వేడుకలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, జావెలిన్ స్టార్, గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, రెజ్లర్ రవికుమార్ దహియాలు పాల్గొన్నారు. అక్టోబర్ 12 వరకు ఈ జాతీయ క్రీడలను నిర్వహించనున్నారు.
వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ క్రీడలను దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగి నిర్వహిస్తున్నారు. చివరి సారిగా 2015లో కేరళలో నిర్వహించారు. ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్ల నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 క్రీడా విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ క్రీడల్లో భాగంగా కొన్ని క్రీడాంశాల్లో పోటీలు ఆరంభమయ్యాయి. కానీ అధికారికంగా గురువారం మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రీడలకు గుజరాత్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. కేరళ వేదికగా జరిగిన క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది.