
హైదరాబాద్: రెప్పపాటు సమయంలో దూసుకుపోయే కార్లు.. క్షణ క్షణానికి మారిన ఆధిక్యత.. నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డ రేసర్లు.. వెరసి హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగిన ఫార్ములా-ఈ రేస్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వేదికగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ గంటన్నర పాటు కొనసాగించింది. భారత్‌లో తొలిసారి జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో జీన్ ఎరిక్ వెర్గ్‌నే(డీఎస్ పెన్‌స్కే రేసింగ్) విజేతగా నిలిచాడు.
ఆ తర్వాత రెండో స్థానంలో నిక్ క్యాసిడీ(ఎన్‌విజన్ రేసింగ్), మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి(ఎన్‌విజన్ రేసింగ్) ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్ అందుకోవడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు.
2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్‌లో జరుగుతున్న ఫార్ములా-ఈ తొలి రేసుకు మన హైదరాబాద్ వేదికైంది. దీనికి తోడు ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హుస్సేన్ సాగర్ తీరాన సెక్రటేరియట్, ఎన్టీఆర్ పార్క్, ఐమ్యాక్స్ మీదుగా 2.835 కిలోమీటర్ల పొడవైన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు 22 మంది రేసర్లు తమ కార్లను రయ్యుమని పరుగెత్తించారు.
ఈ మార్గంలో ఉన్న 18 మలుపులు .. రెండు, మూడు క్లిష్టమైన మలుపులు డ్రైవర్ల నైపుణ్యానికి పరీక్ష పెట్టాయి. రేసింగ్‌లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగాయి.
20,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో అన్ని హంగులతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌ను సిద్ధం చేయగా.. ప్రేక్షకులు, సినీ తారాలు, క్రికెటర్లు సందడి చేశారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.