పారిస్ ఒలింపిక్స్ 2024లో తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. కానీ ఒక్కరు కూడా మెడల్ సాధించలేకపోయారు. ఇప్పుడు అదే వేదికలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పతకాలు సాధించేందుకు తెలుగు పారా అథ్లెట్లు సిద్దమవుతున్నారు. ఈ నెల 28న పారిస్ వేదికగా ప్రారంభమయ్యే పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నలుగురు తెలుగు తేజాలు బరిలో దిగుతున్నారు. తమ వైకల్యాన్ని దాటి పతక వేటకు సై అంటున్నారు.
మాజీ సైనికుడు.. రోయింగ్ నారాయణ
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా, ప్యాపిలికి చెందిన కొంగనపల్లి నారయణ.. రోయింగ్ ఈవెంట్‌లో బరిలోకి దిగుతున్నాడు. కాలం పెట్టిన పరీక్షతో పారా అథ్లెట్‌గా మారిన నారాయణది స్ఫూర్తిదాయక ప్రస్థానం. రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ అయిన నారాయణ.. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో 2007లో భారత సైన్యంలో చేరాడు.

జమ్మూలో విధులు నిర్వర్తించే సమయంలో మందుపాతర పేలడంతో అతని ఎడమ కాలు తీసేయాల్సి వచ్చింది. దాంతో అతను పుణెకు వెళ్లి కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. ఆ సమయంలో కల్నల్ గౌరవ్ దత్తా అతన్ని పారా క్రీడల వైపు మళ్లించాడు. మొదట అతనికి జావెలిన్ పరిచయం చేయగా.. పరుగెత్తడం ఇబ్బందవ్వడంతో రోయింగ్‌కు మారాడు.
ఈ ఆటలో పట్టు సాధించిన నారయణ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టాడు. రాజస్థాన్‌కు చెందిన అనితతో కలిసి మిక్స్‌డ్ విభాగంలో పోటీ పడుతున్నాడు. ఆసియా పారా క్రీడల్లో ఈ జోడీ సిల్వర్ సాధించింది. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్‌లోనూ సత్తా చాటింది.
శ్రీహర్ష రామకృష్ణ..
ఏపీకే చెందిన పారా షూటర్ శ్రీహర్ష రామకృష్ణ కూడా పారాలింపిక్స్ బరిలో నిలిచాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఎస్‌హెచ్2 ప్రపంచకప్‌లో 10 మీటర్ల మిక్స్‌డ్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అతను స్వర్ణం గెలిచాడు. 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంతో రామకృష్ణ వెన్నెముక దెబ్బతిన్నది. అప్పటి నుంచి వీల్‌ఛైర్‌కే పరిమితమైన అతను షూటింగ్‌పై ఫోకస్ పెట్టాడు. పారాలింపిక్స్‌లో పతకం సాధించేందుకు సిద్దమయ్యాడు.
సైక్లింగ్‌లో అర్షద్ షేక్..
ఏపీకే చెందిన అర్షద్ షేక్.. సైక్లింగ్ విభాగంలో బరిలోకి దిగుతున్నాడు. తైక్వాండో ప్లేయర్ అయిన అర్షద్ షేక్..12 ఏళ్ల వయసులో ఓ రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలును మోకాలి వరకు కోల్పోయాడు. దివ్యాంగుల కోటలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అతని తండ్రి క్రీడల వైపు ప్రోత్సహించాడు.
ఆదిత్య మెహతా ఫౌండేషన్ సాయంతో పారా సైక్లిస్ట్‌గా ఎదిగాడు. ఆసియా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ ఎలైట్ వ్యక్తిగత టైమ్ ట్రయల్ సీ2 విభాగం మహిళల్లో జ్యోతి స్వర్ణం, అర్షద్ రజతం గెలిచారు. ఈ గెలుపుతో అర్షద్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అర్షద్ పురుషుల సీ2 వ్యక్తిగత టైమ్ ట్రయల్, సీ1-3 టైమ్ ట్రయల్, సీ2 రోడ్ రేస్, సీ2 వ్యక్తిగత పర్స్యూట్‌లో బరిలో దిగుతున్నాడు.
దీప్తి జీవాంజి..
పుట్టకతోనే జీవాంజి దీప్తికి మానసిక వైకల్యం. పారిస్ పారాలింపిక్స్‌లో ఆమె టీ20 400 మీటర్ల పరుగులో పోటీ పడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె నిలకడైన ప్రదర్శనే అందుకు కారణం. తెలంగాణలోని వరంగల్ జిల్లా, కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి తల్లిదండ్రులు యూదగిరి, ధనలక్ష్మి కూలీలు. మానసిక లోపం ఉన్న దీప్తి.. వేగంగా పరుగెత్తింది.
పాఠశాల్లో పీఈటీ ఆమెను ప్రోత్సహించగా.. ఓ స్కూల్ పోటీల్లో పాల్గొన్న ఆమె.. అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దృష్టిలో పడింది. ఆమెను హైదరాబాద్‌కు రప్పించేలా తల్లిదండ్రులను అతను ఒప్పించాడు. రమేశ్ శిక్షణలో మెరుగైన దీప్తి.. మొదట సాధారణ అథ్లెట్లతోనే పోటీపడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. అనంతరం మానసిక దివ్యాంగుల విభాగంలో పారా పరుగు మొదలెట్టింది. ఆమెకు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆర్థిక సాయం అందించాడు. ఆసియా పారా క్రీడల్లో రికార్డ్ ప్రదర్శనతో పసిడి నెగ్గడంతో దీప్తి పేరు మార్మోగింది.