భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ చరిత్రలోనే ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్రకెక్కింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన వినేష్ ఫోగట్ వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడుతున్న వినేష్ ఫోగట్.. మంగళవారమే జరిగిన సెమీఫైనల్లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లోపూర్తి ఆధిపత్యం చెలాయించిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో వినేష్ ఫోగట్ రజత పతకం ఖాయం చేసుకుంది.

తొలి మ్యాచ్‌లో వినేష్ ఫోగట్.. డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకీ(జపాన్)ను 3-2తో ఓడించింది. చివరి 10 సెకన్లలోనే ఈ విజయానికి కావాల్సిన పాయింట్స్ నమోదు చేయడం విశేషం. ఈ గెలుపుతో వినేష్ ఫోగట్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.
అనంతరం అదే జోరులో 7-5తో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక సెమీఫైనల్లో క్యూబా ప్లేయర్‌ను తనదైన శైలిలో మట్టికరిపించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రేపు జరిగే ఫైనల్లో పసిడి కోసం పోటీ పడుతోంది.
వినేష్ ఫొగట్ గతేడాది నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు మొత్తం రోడ్లపైనే గడిపింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ చరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు ఈ నిరసనలు జరగ్గా.. వినేష్ ఫోగట్ చురుకుగా పాల్గొంది.
అంతేకాకుండా ఆమె రెగ్యూలర్‌గా ఆడే 53 కేజీల కేటగిరిలో అంతిమ్ పంఘల్ ఒలింపిక్స్ అర్హత సాధించడంతో.. వినేష్ ఫోగట్ 50 కేజీల విభాగానికి మారింది. దాంతో ఆమె గెలవడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ వినేష్ ఫొగట్ సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు వినేష్ ఫోగట్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యింది. ఎన్నో అవమానాలు, అవహేళనలను ఎదుర్కొంది. ఇవన్నింటికీ తన గెలుపుతోనే సమాధానమిచ్చింది.