Paris Olympics 2024: ముగిసిన విశ్వ క్రీడా సంబరం.. అగ్రస్థానంలో అగ్రరాజ్యం!
విశ్వక్రీడా సంబరం పారిస్ ఒలింపిక్స్ 2024కు తెరపడింది. పారిస్ వేదికగా గత 19 రోజులుగా జరిగిన వేడుకలు ముగిసాయి. ప్రపంచంలోనే అత్యున్నతమైన ఈ క్రీడల ముగింపు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. సెన్ నది వేదికగా పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ఘనంగా జరగ్గా.. స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో ముగింపు వేడుకలు అంతకంటే అట్టహాసంగా జరిగాయి.
పారిస్ సంస్కృతి ప్రతిబింబించేలా నృత్యకారులు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు. ముగింపు వేడుకల్లో భారత్ తరఫున షూటర్ మను భాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రేక్షకులకు అభివాదం తెలుపుతూ క్రీడాకారులు వీడ్కోలు పలికారు. 2028 ఒలింపిక్స్ పోటీలు లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్నాయి.

పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాల కోసం 206 దేశాలకు చెందిన 10,714 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. అమెరికా 40 స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలవగా.. చైనా సైతం 40 స్వర్ణాలతో రెండో స్థానంలో నిలిచింది. చివరి బంగారు పతకాంశం వరకు అగ్రస్థానంలో ఉన్న చైనాను అమెరికా వెనక్కునెట్టింది. మహిళల బాస్కెట్‌బాల్‌లో బంగారు పతకం సాధించి.. ఒలింపిక్స్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది.
ఈ ఒలింపిక్స్‌లో అమెరికా మొత్తం 40 గోల్డ్ మెడల్స్‌తో సహా మొత్తం 126 పతకాలు సాధించింది. ఇక చైనా 40 స్వర్ణాలతో పాటు 91 పతకాలు గెలిచింది. స్వర్ణ పతకాలు ఎక్కువగా ఉన్న జట్టు ముందు ర్యాంక్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ ఇరు దేశాల స్వర్ణాలు సమం కావడంతో.. ఎక్కువ పతకాలు సాధించిన అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 20 బంగారు పతకాలతో జపాన్ మూడో స్థానంలో ఉండగా.. 6 పతకాలతో భారత్ 71వ స్థానంతో సరిపెట్టుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్.. ఈ సారి తీవ్రంగా నిరాశపరిచింది. దాయాదీ పాకిస్థాన్ ఒకే ఒక్క బంగారు పతకంతో భారత్ కంటే మెరుగైన 62వ స్థానంలో నిలవడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications