ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టిస్తుందనుకున్న మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్.. కీలక పోరుకు ముందు అధిక బరువు కారణంగా డిస్‌క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.
50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్.. 150 గ్రాములు ఎక్కువ బరువు ఉండటంతో రూల్స్ ప్రకారం అనర్హత వేటు వేసారు. యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం బరువు ప్రమాణాలను అందుకోని రెజ్లర్లపై అనర్హత వేటు వేస్తారు. అంతేకాకుండా ఆ పోటీల్లో చివరి ర్యాంక్‌ను ఇస్తారు.

రెజ్లింగ్ రూల్స్ ప్రకారం ప్రతీ కేటగిరి పోటీలు జరిగే రోజు ఉదయం ప్రతీ రెజ్లర్ ఆయా విభాగంలో ఉన్నారని నిర్దారించేందుకు బరువును కొలుస్తారు. వినేష్ ఫోగట్ సైతం ఇదే రూల్స్ ప్రకార తన బరువును నిర్దారించుకుంది. మంగళవారం ఆమె 50 కేజీల బరువే ఉంది. కానీ ఫైనల్ చేరిన అనంతరం రెండు కిలోల బరువు పెరిగినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ల సందర్భంగా ఎనర్జీ కోసం తీసుకున్న ఫ్లూయిడ్స్ ఆమె బరువును పెంచినట్లు తెలుస్తోంది.
ఈ విషయం గ్రహించిన ఆమె.. సెమీఫైనల్ ముగిసిన వెంటనే బరువు తగ్గించుకునేందుకు కసరత్తులు చేసింది. జాగింగ్, స్కిప్పింగ్‌తో పాటు రన్నింగ్ చేసింది. కానీ 1.85 కిలోలు మాత్రమే తగ్గింది. చివరకు 150 గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురి అయ్యింది. బరువు తగ్గించుకోవడానికి కాస్త సమయం కావాలని భారత ఒలింపిక్ కమిటీ చేసిన విజ్ఞప్తిని పారిస్ ఒలింపిక్ కమిటీ పట్టించుకోలేదు.
దాంతో ఆమె డిస్‌క్వాలిఫై అయ్యింది. అయితే అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్‌కు కాస్త సమయం ఇవ్వాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఒలింపిక్ కమిటీ రూల్స్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అథ్లెట్ల కష్టానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినేష్ ఫోగట్‌ను ఫైనల్ ఆడించకపోయినా.. అంతకుముందు సాధించిన విజయాలనైనా గుర్తించి రజత పతకం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పురుష లక్షణాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ స్వయంగా నిషేధించిన ఇమానే ఖలిఫ్‌ను అనుమతించిన ఒలింపిక్ కమిటీ.. 150 గ్రాములు అధిక బరువున్న వినేష్ ఫోగట్ ఆడించకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఒలింపిక్ కమిటీ ద్వంద వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.