పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళా షూటర్ మను భాకర్ కాంస్య పతకంతో సత్తా చాటింది. 20 ఏళ్ల తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన మను భాకర్ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించి మూడో స్థానంలో నిలిచింది. దాంతో కాంస్య పతకాన్ని అందుకుంది.
తద్వారా ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్ 221.7 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి భారత్ పతకాల ఖాతాను తెరిచింది.

ఫైనల్‌కు అర్హత సాధించిన ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్దతిలో తుది పోరు జరిగింది. ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్‌లు సంధించగా.. తక్కువ స్కోర్ నమోదు చేసిన చివరి షూటర్‌ను ఎలిమినేట్ చేశారు.
ఇలా ప్రతి రెండు షాట్స్ తర్వాత ఒక్కో షూటర్ నిష్క్రమించగా.. మొత్తం 24 షాట్‌లు ముగిసే సరికి సౌత్ కోరియా షూటర్స్ జిన్ ఓ యే, కిమ్ యెజి టాప్-2లో నిలిచి గోల్డ్, సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు.
మూడో స్థానంలో నిలిచిన భారత షూటర్‌కు కాంస్యం దక్కింది. జిన్ ఓయే 243.2 స్కోర్‌తో టాప్‌లో నిలవగా.. కిమ్ యెజి 241.3 స్కోర్‌తో మను భాకర్ కంటే మందుంజలో నిలిచింది.
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఈ హర్యానా షూటర్.. అన్ని ఈవెంట్లలో కనీసం ఫైనల్ చేరలేకపోయింది. గన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం ఆమె ఘోర పరాజయానికి కారణమైంది. కానీ ఈసారి ఆడిన తొలి ఈవెంట్‌లోనే అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరడంతో పాటు పతకాన్ని అందుకుంది.
ఈ ఒలింపిక్స్‌లో మను భాకర్ మహిళల 25మీ. పిస్టల్ ఈవెంట్‌తో పాటు, 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్, 10మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లలో పోటీపడుతోంది. మను భాకర్ కాంస్యంతో షూటింగ్‌లో ఇప్పటి వరకు భారత్ ఒలింపిక్స్ మెడల్స్ సంఖ్య ఐదుకు చేరింది. దేశానికి తొలి పతకాన్ని అందించిన మను భాకర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.