పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సెమీ ఫైనల్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. కీలక పోరులో మాత్రం చేతులెత్తేసాడు. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను అనవసర తప్పిదాలతో చేజార్చుకున్నాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్ 20-22, 14-21 తేడాతో రెండో సీడ్, డెన్మార్క్ ప్లేయర్ విక్టోర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఫస్ట్ గేమ్‌లో గేమ్ పాయింట్ ముందు సర్వీస్‌లో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మూడు పాయింట్స్‌లో వెనుకంజలో ఉన్న డెన్మార్క్ ప్లేయర్ తన అనుభవంతో పుంజుకొని లక్ష్యసేన్‌ను ఓడించాడు.
ఇక లక్ష్యసేన సోమవారం జరిగే కాంస్యపోరులో తలపడనున్నాడు. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే అతనికి కాంస్య పతకం దక్కనుంది. సెమీఫైనల్లో ఒత్తిడిని అధిగమించడంలో లక్ష్యసేన్ విఫలమయ్యాడు.

లక్ష్యసేన్ చేజేతులా..
తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ హోరా హోరీగా తలపడ్డారు. నువ్వా-నేనా అన్నట్లు ఒక్కో పాయింట్‌తో 8-8తో ముందుకు సాగారు. ఈ సమయంలో లక్ష్యసేన్ క్రాస్ కోర్ట్ స్మాష్‌తో ఒక్క పాయింట్ ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత విక్టోర్ అక్సెల్సెన్ అనవసర తప్పిదాలు చేయడంతో లక్ష్యసేన్ 5 పాయింట్స్ ఆధిక్యలోకి దూసుకొచ్చాడు.
ఈ పరిస్థితుల్లో డెన్మార్క్ ఆటగాడు అద్భుతంగా పుంజుకున్నాడు. తనకే సాధ్యమైన నెట్ ప్లేతో వరుస పాయింట్స్ సాధించి 17-18తో లక్ష్యసేన్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ సమయంలో సూపర్ క్రాస్ కోర్ట్స్ షాట్స్‌తో వరుసగా రెండు పాయింట్స్ సాధించి లక్ష్యసేన్ ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. కానీ గేమ్ పాయింట్ ముందు లక్ష్యసేన్ సర్వీస్ ఎర్రర్ చేసి పాయింట్ చేజార్చుకున్నాడు.
అనంతరం సుదీర్ఘమైన ర్యాలీలోనూ డెన్మార్క్ ఆటగాడు పాయింట్ సాధించగా.. లక్ష్యసేన్ తప్పిదంతో స్కోర్లు 20-20 సమమయ్యాయి. అనవసర తప్పిదాలు చేసిన లక్ష్యసేన వరుసగా రెండు పాయింట్స్ కోల్పోయి 20-22తో తొలి గేమ్‌ను డెన్మార్క్ ఆటగాడికి కోల్పోయాడు.
7 పాయింట్స్ ఆధిక్యం సాధించి..
రెండో గేమ్‌లో విక్టోర్ శుభారంభం చేయగా.. లక్ష్యసేన సమం చేశాడు. వరుసగా ఏడు పాయింట్స్ సాధించి 7-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ అద్భుతంగా పుంజుకున్న విక్టోర్.. లక్ష్యసేన్ అనవసర తప్పిదాలను అడ్వాంటేజ్‌గా మార్చుకున్నాడు. వరుసగా పాయింట్స్ సాధించి 10-10తో స్కోర్ సమం చేశాడు.
తన అనుభవాన్ని ఉపయోగించిన విక్టోర్ వరుస పాయింట్స్‌తో లక్ష్యసేన్‌పై ఒత్తిడి పెంచాడు. అతని తప్పిదాలను క్యాష్ చేసుకొని వరుస పాయింట్స్‌తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొని ఫైనల్‌కు అర్హత సాధించాడు.