పారిస్ ఒలింక్స్ 2024 ప్రారంభోత్స వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఇటలీ హైజంపర్, టోక్యో గోల్డ్ మెడలిస్ట్ గియాన్మార్కో టాంబేరి తన సతీమణికి క్షమాపణలు చెప్పాడు. ఆరంభ వేడుకల్లో ఇటలీ ప్లాగ్ బేరర్‌గా వ్యవహరించిన టాంబేరి తన వెడ్డింగ్ రింగ్‌ను సెన్ నదిలో పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన టాంబేరి.. తన భార్యకు క్షమాపణలు చెప్పాడు.
ఈ సందర్భంగా అతను రాసిన వ్యాక్యలు హృద్యంగా, ఆసక్తికరంగా అందరి మనసులను గెలుచుకున్నాయి. 'నా ప్రియతమా నన్ను క్షమించు. సెన్ నదిలో ఎక్కువ నీళ్లు ఉండటమో.. కొద్ది నెలలుగా బరువు తగ్గడమో లేదా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాననే అత్యుత్సాహమో ఏమో కానీ మన వెడ్డింగ్ రింగ్ చేజారిపోయింది.

బోట్‌లో బౌన్స్ అయ్యే వరకు దానిని పట్టుకొనేందుకు ప్రయత్నించా. బోట్ లోపలే పడుతుందని భావించా. కానీ ఆ రింగ్ గాల్లోకి ఎగురుకుంటూ వెళ్లి నదిలో పడిపోయింది. ఇలా రింగ్ పడిపోవడానికి ఓ కారణం ఉందనిపిస్తోంది. ఆ రింగ్‌కు ఇంతకు మించిన గొప్ప ప్రాంతం మరొకటి ఉండదేమో.. 'సిటీ ఆఫ్ లవ్'కు వేదికైన నదిలో మన వెడ్డింగ్ రింగ్ పడిపోవడం అద్భుతం. దీని కంటే ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా ఈవెంట్‌లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే అవకాశం రావడం గొప్ప అనుభూతి.
ఆ రింగ్ పోయినా బాధ లేదు. మళ్లీ కొత్తగా ప్రమాణాలు చేసుకుందామని అడుగుతుంటావ్ కదా.. మళ్లీ కొత్తగా పెళ్లి చేసుకుందాం. ఇది కొంచెం కవిత్వంలా అనిపించవచ్చు. నీ ఉంగారాన్ని కూడా సెన్ నదిలో విసిరేస్తే ఆ రెండు కలిసిపోతాయి. వెడ్డింగ్ రింగ్ కంటే విలువైన బంగారు పతకంతో ఇంటికి వస్తా.'అని తన సతీమణి చైరా బోంటేమిని ఉద్దేశించి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.