పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ టీమ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రెండు విజయాలతో పాటు ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకొని పూల్-బీ నుంచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్.. బెల్జియంతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో బెల్జియం చేతిలో ఖంగుతిన్నది.
భారత్ తరఫున అభిషేక్(18వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేయగా.. బెల్జియం తరఫున థిబ్యూ స్టాక్‌బ్రోక్సెక్స్(33వ నిమిషం), జాన్ జాన్ డోహ్మెన్(44 వ నిమిషం) గోల్స్‌తో తమ విజయంలో కీలక పాత్ర పోషించారు.

వాస్తవానికి ఈ మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. ఫస్ట్ క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. రెండో క్వార్టర్స్ ఆరంభంలోనే... అభిషేక్ అద్భుత షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. దాంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అనంతరం బెల్జియం స్కోర్లు సమం చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ భారత డిఫెన్స్ విభాగం అద్భుతంగా అడ్డుకుంది. హాఫ్ టైమ్ ముగిసే సరికి భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్ ప్రారంభమైన వెంటనే థిబ్యూ స్టాక్ బ్రోక్సెక్.. భారత గోల్‌కీపర్ శ్రీజేష్‌ను తప్పిస్తూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. దాంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి.
ఈ గోల్ అనంతరం టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ బెల్జియం.. భారత్‌పై ఒత్తిడిని రెట్టింపు చేసింది. మూడో క్వార్టర్స్ చివర్లో బెల్జియంకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత గోల్ కీపర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు. కానీ కుడివైపు ఉన్న జాన్ జాన్ డోహ్‌మెన్ వెంటనే బంతిని గోల్ పోస్ట్‌లోకి కొట్టి బెల్జియం ఆధిక్యాన్ని డబుల్ చేశాడు.
ఈ గోల్‌ను భారత్ ఏ మాత్రం ఊహించలేకపోయింది. చివరి క్వార్టర్‌లో తీవ్ర ఒత్తిడిలో ఆడిన భారత్.. గోల్ చేసే పలు అవకాశాలను కూడా భారత్ చేజార్చుకుంది. దాంతో భారత్ ఓటమిపాలైంది. ఈ ఓటమితో పూల్-బీలో భారత్ రెండో స్థానానికి పడిపోగా.. బెల్జియం అగ్రస్థానాని చేరింది. ఇప్పటికే ఈ రెండు జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.
భారత్ తమ చివరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. భారత్‌కు నష్టం ఏం లేదు. కానీ క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొవాల్సి ఉంటుంది.