భారత హాకీ గోల్ కీపర్ శ్రీజేష్ తన కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా స్పెయిన్‌తో గురువారం జరిగిన కాంస్య పోరులో చివరి సారిగా బరిలోకి దిగిన శ్రీజేష్.. అద్భుత విజయంతో ఆటకు అల్విదా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించి వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించింది.
తన ఆఖరి మ్యాచ్‌లో గోల్‌కీపర్‌గా శ్రీజేష్ తన మార్క్ చూపించాడు. భారత గోల్ పోస్ట్‌కు అడ్డు గోడలా నిల్చొని స్పెయిన్ గోల్స్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు శ్రీజేష్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్‌పై కూర్చోబెట్టారు. అనంతరం తమ హాకీ స్టిక్స్‌తో శ్రీజేష్‌కు జేజేలు పలికారు.

భారత విజయ లాంఛనం పూర్తయిన వెంటనే మైదానంలో బొక్క బోర్లా పడుకొని శ్రీజేష్ సాష్టాంగ నమస్కారం చేశాడు. అనంతరం భారత ఆటగాళ్లంతా అభినందిస్తూ అతనిపై పడుకున్నారు. చివరగా.. ప్రేక్షకులు, భారత ఆటగాళ్ల కరతాళ ధ్వనుల మధ్య శ్రీజేష్ బరువెక్కిన హృదయంతో మైదానం వీడాడు.
ప్రస్తుతం శ్రీజేష్ వీడ్కోలుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా టోక్యో ఒలింపిక్స్‌లో గెలిచిన బ్రాంజ్ మెడల్‌ను నిలబెట్టుకుంది. ప్రపంచానికి హాకీ ఆటను నేర్పిన భారత్‌కు ఇది 13వ ఒలింపిక్స్ మెడల్. వరుసగా 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన భారత్.. ఆ తర్వాత లయ తప్పింది.
టోక్యో ఒలింపిక్స్‌లో అసాధారణ ప్రదర్శనతో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత్.. ఈ సారి మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ జర్మనీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓటమిపాలైంది. స్పెయిన్‌తో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఎలాంటి తప్పిదం చేయలేదు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్(29వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్లేస్(18వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు.