హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించింది.
గురువారం జరిగిన కాంస్య పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించి వరుసగా రెండో కాంస్య పతకాన్ని అందుకుంది. భారత్ చివరిసారిగా 1968, 1972 ఒలింపిక్స్ గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్ 2020, పారిస్ ఒలింపిక్స్ 2024లో వరుసగా బ్రాంజ్ మెడల్స్ గెలిచింది.

తాజా పతకంతో ఒలంపిక్స్‌లో భారత హాకీ మెడల్స్ సంఖ్య 13కు చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. తాజా
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. ఇప్పటి వరకు షూటింగ్‌లో మూడు కాంస్య పతకాలు వచ్చాయి.
స్పెయిన్‌తో జరిగిన ఈ కాంస్య పోరులో హర్మన్‌ప్రీత్ సింగ్(29వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 10 గోల్స్ నమోదు చేసి ఈ ఒలింపిక్స్‌లోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ సైతం అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. స్పెయిన్‌కు లభించిన 9 పెనాల్టీ కార్నర్స్‌లో ఎనిమిదింటిని అద్భుతంగా అడ్డుకున్నాడు. భారత్‌కు లభించిన 6 పెనాల్టీ కార్నర్స్‌లో రెండింటిని హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్‌గా మలిచాడు.
ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ మార్క్ మిరాల్లేస్(18వ నిమిషం) ముందుగా గోల్ చేసి ఆధిక్యం ప్రదర్శించింది. కానీ కాసేపటికే భారత్ గోల్ నమోదు చేసి స్కోర్లు సమం చేసింది. మూడో క్వార్టర్‌లో మరో గోల్ చేసి 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని సొంతం చేసుకుంది. స్కోర్లు సమం చేసేందుకు స్పెయిన్ చేసిన ప్రయత్నాలన్నింటినీ భారత డిఫెన్స్ విభాగం తిప్పి కొట్టింది.