పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు తీవ్రంగా నిరాశపరిచారు. 52 లక్షల జనాభా మాత్రమే ఉన్న న్యూజిలాండ్ 10 స్వర్ణాలు సాధిస్తే.. 140 కోట్ల జనాభా ఉన్న భారతావని ఒక్కటంటే ఒక్క బంగారు పతకం సాధించలేకపోయింది. చివరకు మన దాయాదీ పాకిస్థాన్ సైతం బంగారు పతకం గెలుచుకుంది.
భారత అథ్లెట్లు మాత్రం ఓ రజతం, ఐదు కాంస్యాలతో మొత్తం 6 పతకాలతోనే సరిపెట్టారు. టోక్యో ఒలింపిక్స్(స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) కంటే తక్కువ ప్రదర్శనే చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మెడల్స్ పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. పతకాల ఖాతా తెరిచిన 84 దేశాల్లో భారత్ 71వ స్థానంలో నిలవడాన్ని క్రీడాభిమానులు సహించలేకపోతున్నారు.

మూడేళ్లుగా రూ. 470 కోట్ల ఖర్చు..
రియో ఒలింపిక్స్ 2016లో రెండు పతకాలు మాత్రమే సాధించిన భారత్.. టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం 7 పతకాలతో సత్తా చాటింది. దాంతో క్రీడల్లోనూ భారత్ పురోగతి సాధించిందని, భవిష్యత్తులో తిరుగుండదని అంతా భావించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య డబుల్ డిజిట్ ధాటుతుందని భావించారు. ప్రభుత్వం కూడా ఎన్నడూ లేని విధంగా పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం బాగా ఖర్చు పెట్టింది.
ఈ విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటాలనే లక్ష్యంతో వారికి అన్ని విధాల అండగా నిలిచింది. గత మూడేళ్లుగా పారిస్ ఒలింపిక్స్ కోసం భారత ప్రభుత్వం రూ. 470 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందులో ఎక్కువ భాగం అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం రూ. 96.08 కోట్లు ఖర్చు చేయగా.. బ్యాడ్మింటన్‌కు రూ. 72.02 కోట్లు, బాక్సింగ్‌కు రూ. 60.93 కోట్లు, షూటింగ్‌కు రూ. 60.42 కోట్లు వెచ్చించింది.
చేజారిన 6 పతకాలు..
బ్యాడ్మింటన్‌లో ఒక్క పతకం రాకపోగా.. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా ఒక్కడే రజత పతకం సాధించాడు. ఊహించినట్లుగానే షూటింగ్‌లో మూడు పతకాలు వచ్చాయి. హాకీ ఇండియా మరోసారి కాంస్యంతో సత్తా చాటగా.. రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ ఒక కాంస్య పతకం సాధించాడు. పతకాలు పక్కా వస్తాయని ఆశించిన బ్యాడ్మింటన్, ఆర్చరి, బాక్సింగ్ ఈవెంట్లలో నిరాశే ఎదురైంది. ఈ మూడు క్రీడల్లో భారత్‌కు ఒక్క పతకం రాలేదు.
మరో 6 పతకాలు తృటిలో చేజారాయి. రజతం ఖాయం చేసుకున్న వినేశ్ ఫోగట్ అధిక బరువుతో డిస్‌క్వాలిఫై కాగా.. షూటింగ్‌లో మనుభాకర్, అనంత్ -మహేశ్వరి, అర్జున్, ధీరజ్-అంకిత( ఆర్చరీ), మీరాబాయి చాను(వెయిట్‌లిఫ్టింగ్), లక్ష్యసేన్(బ్యాడ్మింటన్) నాలుగో స్థానాల్లో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకున్నారు.
భారత ప్రభుత్వం పెట్టిన రూ. 470 కోట్ల ఖర్చుకు వచ్చిన పతకాలకు ఏమాత్రం సంబంధం లేదని నెటిజన్లు నిట్టూరుస్తున్నారు. ఒక్కో పతకం కోసం భారత్ రూ. 78 కోట్లు ఖర్చు పెట్టినట్లు అయ్యిందని, ఇదా చాలా కాస్ట్‌లీ గురూ! అంటూ కామెంట్ చేస్తున్నారు.