పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ హాకీ టీమ్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. గురువారం జరిగిన కాంస్యపోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ గెలుపుతో గత టోక్యో ఒలింపిక్స్ 2020లో గెలిచిన బ్రాంజ్ మెడల్‌ను హర్మన్‌సింగ్ సేన నిలబెట్టుకుంది.
ఈ గెలుపుతో భారత గోల్ కీపర్ శ్రీజేష్ తన కెరీర్‌కు ఘన వీడ్కోలు పలికాడు. తన ఆఖరి మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతంగా గోల్స్‌ను అడ్డుకున్నాడు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్(29వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్లేస్(18వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. హాకీలో భారత్‌కు ఇది 13వ గోల్.

హోరాహోరీగా..
తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు హోరా హోరీగా తలపడటంతో గోల్స్ నమోదు కాలేదు. మ్యాచ్ ఆరంభంలోనే భారత ఫార్వర్డ్ ప్లేయర్ సుఖ్‌జీత్ సింగ్ గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బంతిని గోల్‌పోస్ట్‌కు దూరంగా కొట్టాడు. ఆ కాసేపటికే స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా.. గోల్‌కీపర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం భారత్ దూకుడుగా ఆడగా.. స్పెయిన్ అద్భుతంగా డిఫెండ్ చేసింది. దాంతో ఫస్ట్ క్వార్టర్ 0-0తో ముగిసింది.
రెండో క్వార్టర్స్‌లో అటాకింగ్ అప్రోచ్ కనబర్చిన స్పెయిన్.. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని భారత గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. ఈ క్రమంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ మార్క్ మిరాల్లేస్ అద్భుతంగా గోల్ కొట్టి 1-0తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన స్పెయిన్.. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుంది.
సెకండ్ క్వార్టర్స్ చివర్లో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్స్ లభించగా.. ఒకటి వృథా చేసుకొని మరొకటి గోల్‌గా మలిచింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తనదైన శైలిలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు.
గోల్‌ను అనమతించని రిఫరీ
మూడో క్వార్టర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. స్పెయిన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మల్చగా.. రిఫరీ అనుమతించలేదు. బంతి స్పెయిన్ ఆటగాడి మోచేతిని తాకిన తర్వాత గోల్ పోస్ట్‌లోకి వెళిందని గోల్‌కు నిరాకరించారు. ఆ కాసేపటికే భారత్‌కులభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచి 2-1తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు.
చివరి క్వార్టర్ ఆరంభంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం లభించగా.. సుఖ్‌జీత్ సింగ్ వృథా చేశాడు. బంతిని గోల్‌పోస్ట్‌కు దూరంగా కొట్టాడు. స్పానిష్ ప్లేయర్ బలంగా ఢీకొట్టడంతో భారత ప్లేయర్ హార్దిక్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను మైదానం వీడగా.. రీప్లెస్‌మెంట్‌గా మన్‌ప్రీత్ బరిలోకి దిగాడు. అనంతరం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న భారత్.. స్పెయిన్ రక్షణ శ్రేణిని ఛేదిస్తూ గోల్ పోస్ట్‌పైకి దాడి చేసింది.
ఆట నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా.. స్పెయిన్ గోల్ కీపర్ లేకుండా ఎక్స్‌ట్రా స్ట్రోక్ ప్లేయర్‌తో బరిలోకి దిగింది. భారత డిఫెన్స్‌ను చేధిస్తూ ముందుకు సాగిన స్పెయిన్‌కు వరుసగా రెండు పెనాల్టీ కార్నర్ లభించగా.. భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు. స్పెయిన్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. కానీ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పిదం కారణంగా.. స్పెయిన్‌కు వరుసగా రెండు పెనాల్టీ కార్నర్ లభించగా.. భారత్ అద్భుతంగా అడ్డుకుంది. దాంతో భారత విజయం లాంఛనమైంది.