పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బాక్సర్ల పోరాటం ముగిసింది. అద్భుత ప్రదర్శనతో 75 కేజీల క్వార్టర్ ఫైనల్ చేరి మెడల్ ఆశలు రేకిత్తించిన లవ్లీనా బోర్గోహైన్ తీవ్రంగా నిరాశపరిచింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 1-4 తేడాతో చైనా బాక్సర్ లి కియాన్ చేతిలో చిత్తయ్యింది. చైనా బాక్సర్ ధాటికి లవ్లీనా కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
లవ్లీనా తొలి రెండు రౌండ్లలో 47-48, 47-48తో వెనుకంజలో నిలిచింది. మూడో రౌండ్‌లో 49-46తో పుంజుకున్నప్పటికీ.. ఓటమిపాలైంది. ఐదు గురు జడ్జీల్లో నలుగురు లవ్లీనాకు వ్యతిరేకంగానే స్కోర్ వేసారు. ఈ మ్యాచ్‌లో లవ్లీనా గెలిచి ఉంటే కనీసం కాంస్య పతకం ఖాయమయ్యేది. లవ్లీనా ఓటమితో పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ల పోరాటం ముగిసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన నిఖత్ జరీన్ రెండో రౌండ్‌లోనే ఓటమిపాలవ్వగా.. లవ్లీనా పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది.

పురుషుల బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. 71 కేజీల విభాగంలో పోటీ పడిన నిశాంత్ దేవ్.. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే 4-1 తేడాతో నిశాంత్ దేవ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ తొలి రౌండ్‌లో ఆధిక్యం ప్రదర్శించిన నిశాంత్ దేవ్.. వరుసగా రెండు రౌండ్లలో మెరుగైన ప్రదర్శన కనబర్చినా.. జడ్జీలు ప్రత్యర్థి బాక్సర్‌కు అనుకూలమైన తీర్పు ఇచ్చారు.