ఒలింపిక్స్ చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణం షూటింగ్‌లోనే దక్కింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా దశాబ్దాల నిరీక్షణకు తెరదించాడు. మరో నాలుగేళ్లకు ఇదే షూటింగ్‌లో రెండు పతకాలు దక్కాయి. దాంతో ఈ ఆటలో భారత్‌కు పతకాల పంటే అని అంతా అనుకున్నారు. కానీ రియో, టోక్యో ఒలింపిక్స్‌లో షూటర్లు తీవ్రంగా నిరాశపరిచారు.
భారీ అంచనాలతో బరిలోకి దిగి అత్యంత నిరాశాజనక ప్రదర్శన చేశారు. కనీసం ఈ సారైనా మళ్లీ పూర్వ వైభవం అందుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే గత రెండు పర్యాయల్లో ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న షూటింగ్ బృందం ఒకటికి మించే పతకాలు సాధిస్తుందన్న ఆశలు కలుగుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయ వేదికల్లో భారత షూటర్లు అదరగొట్టారు.

షూటింగ్‌లో నాలుగు పతకాలే..
ఇప్పటి వరకు షూటింగ్‌లో భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రజతంతో ఖాతా తెరిస్తే... నాలుగేళ్ల తర్వాత బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణంతో మెరిసి చరిత్ర సృష్టించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధిస్తే.. హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు.
వరుసగా మూడు పర్యాయాలు షూటింగ్‌లో పతకాలు రావడంతో.. షూటర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రియో, టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు నిరాశపరిచారు. టోక్యో ఒలింపిక్స్‌కు రికార్డ్ స్థాయిలో 15 మంది షూటర్లు బరిలో నిలిచినా ఒక్కరు పతకాన్ని అందుకోలేకపోయారు.
సూపర్ ఫామ్‌లో భారత షూటర్లు..
ఒలింపిక్స్ అర్హత సాధించిన షూటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆసియా క్రీడల్లో అసాధారణ ప్రదర్శనతో 9 స్వర్ణాలు గెలిచారు. ఇదే జోరును ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తే పతకాలు గెలవడం ఖాయం. ఈ సారి ఏకంగా రికార్డు స్థాయిలో 21 మంది షూటర్లు పారిస్ బరిలో నిలిచారు. యువ షూటర్ మను బాకర్ మూడు విభాగాల్లో పోటీ పడబోతుండటం విశేషం.
వ్యక్తిగత విభాగాల్లో రైఫిల్‌లో 8 మంది, పిస్టల్‌లో 8 మంది, షాట్‌గన్‌లో ఆరుగురు పతకాల కోసం పోటీపడుతున్నారు. ఈ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే భారత్‌కు 16 పతకాలు దక్కుతాయి. మిక్స్‌డ్ ఈవెంట్లలో ఐదు జోడీలు బరిలో నిలిచాయి.
హాట్ ఫేవరేట్‌గా మను బాకర్, సరబ్ జ్యోత్..
భారత టీనేజీ సెన్సేషన్ మను బాకర్ హాట్ ఫేవరేట్‌గా పారిస్ ఒలింపిక్స్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌తో పాటు 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడుతోంది. అంతేకాకుండా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్లో సరబ్‌జ్యోత్‌తో కలిసి బరిలోకి దిగనుంది. ఆసియా క్రీడల్లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచింది. ఇదే జోరును పారిస్ ఒలింపిక్స్‌లో చూపిస్తే.. పోడియంపై నిలవడం ఖాయం.

హైదరాబాద్ నుంచి ఇషా సింగ్..
ఒలింపిక్స్ షూటింగ్ టీమ్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ కూడా ఉంది. 19 ఏళ్ల ఇషా సింగ్ కొన్నేళ్లుగా ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతోంది. ఆసియా క్రీడల్లో ఆమె 4 పతకాల్లో భాగమైంది. ఒలింపిక్స్‌లో ఇషా సింగ్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పోటీ పడనుంది.
భారత షూటింగ్ టీమ్..
10 మీటర్ల ఎయిర్ రైఫిల్..
పురుషులు: సందీప్ సింగ్, అర్జున్ బబుతా
మహిళలు: ఎలవేనిల్, రమిత జిందాల్
50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్..
పురుషులు: ఐశ్వరీ ప్రతాప్, స్వప్నిల్
మహిళలు: సిఫ్త్ కౌర్ శర్మ, అంజుమ్
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌టీమ్: సందీప్-ఎలవేనిల్, అర్జున్ బబుతా-రమి
10 మీటర్ల ఎయిర్ పిస్టల్..
పురుషులు: సరబ్‌జ్యోత్, అర్జున్ చీమా
మహిళలు: మను బాకర్, రిథమ్ సాంగ్వాన్
25 మీటర్ల ఎయిర్ పిస్టల్..
పురుషులు: అనీష్ బన్వాలా, విజయ్ వీర్
మహిళలు: మను బాకర్, ఇషా సింగ్
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌టీమ్: సరబ్‌జ్యోత్-మను, అర్జున్ చీమా-రిథమ్
షాట్ గన్:
పురుషులు: పృథ్వీ రాజ్
మహిళలు: రాజేశ్వరి,శ్రేయసి
స్కీట్
పురుషులు: అనంత్ జీత్
మహిళలు: మహేశ్వరి, రైజా ధిల్లాన్
స్కిట్ మిక్స్‌డ్ టీమ్: అనంత్ జీత్-మహేశ్వరి