
టోక్యో: ప్రతిష్టాత్మక పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు పతకాలతో సత్తాచాటారు. భవీనా పటేల్ రజతంతో ఖాతా తెరవగా.. గంట వ్యవధిలోనే హైజంపర్ నిషధ్ కుమార్, డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్ మరో రెండు పతకాలు సాధించి ఆ అనందాన్ని రెట్టింపు చేశారు. నిషధ్ కుమార్ రజతం గెలవగా.. వినోద్ కుమార్ కాంస్యం సాధించాడు.
ఆదివారం జరిగిన డిస్కస్ త్రో F52 కేటగిరిలో డిస్కస్‌ను 19.91 మీటర్ల దూరం విసిరిన వినోద్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 17.46 మీటర్లే విసిరిన వినోద్.. రెండో ప్రయత్నంలో 18.32 మీటర్లు, మూడో ప్రయత్నంలో 17.80 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 19.12 మీటర్లు విసిరాడు. ఇక చివరి ప్రయత్నంలో 19.91 మీటర్లు విసిరి పతకం ఖాయం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆసియా రికార్డు బ్రేక్ చేశాడు.
అంతకుముందు జరిగిన పురుషుల హై జంప్ టీ-47 కేటగిరీలో భారత ప్లేయర్ నిషధ్ కుమార్ రజత పతకం సాధించాడు. అమెరికా అథ్లెట్ డల్లాస్ వైస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచిన అతను సిల్వర్ మెడల్‌ను షేర్ చేసుకున్నాడు. ఫైనల్ రౌండ్‌లో 1.94 మీటర్లను సునాయసంగా అధిగమించిన నిషద్ కుమార్.. 1.98 మీటర్లకు కొంత కష్టపడ్డాడు.
రెండో ప్రయత్నంలో ఎట్టకేలకు అధిగమించి టాప్‌కు దూసుకెళ్లాడు. కానీ అమెరికా అథ్లెట్లు డల్లాస్ వైస్, రొడెరిక్ టౌన్‌సెండ్ అతనికి గట్టి పోటీనిచ్చారు. 2.06 మీటర్లను క్లియర్ చేసి నిషద్ పతకాన్ని ఖాయం చేసుకోగా..డల్లాస్ వైస్ కూడా అంతే ఎత్తును క్లియర్ చేసి సమంగా నిలిచాడు. ఇక 2.15 మీటర్లతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రొడెరిక్ టౌన్‌సెండ్ స్వర్ణపతకం సాధించాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత హై జంపర్ రాంపాల్ చాహర్ పోడియం ఎక్కలేకపోయాడు. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 1.96 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన రాంపాల్.. 1.98 మీటర్ల ఎత్తును క్లియర్ చేయలేకపోయాడు.
ఉదయం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్ విభాగం సింగిల్స్ క్లాస్ 4 ఫైనల్లో భవీనాబెన్ పటేల్ 7-11, 5-11, 6-11 స్కోర్ తేడాతో చైనాకు చెందిన యింగ్ ఝౌ చేతిలో పరాజయం పాలైంది. దాంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మెడల్ సాధించిన అనంతరం భవీనా పటేల్ మీడియాతో మాట్లాడింది. ఫైనల్లో తన ప్రదర్శన పట్ల నిరాశగా ఉన్నానని, స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయానని అంగీకరించింది. వచ్చే టోర్నీల్లో ఈ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపింది. గుజరాత్‌కు చెందిన భవీనాబెన్ పటేల్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల నజరానా ప్రకటించింది.