Paralympics 2024: నిషాద్‌కు రజతం.. ప్రీతికి కాంస్యం!
పారాలింపిక్స్ 2024లో భారత్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. మరో రెండు మెడల్స్ ఖాయమయ్యాయి. పురుషుల హైజంప్ టీ47లో నిషాద్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించగా.. మహిళల 200 మీటర్ల టీ35 పరుగులో ప్రీతి పాల్ బ్రాంజ్ మెడల్ సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్‌లో మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి.
ఆదివారం జరిగిన పురుషుల హైజంప్ టీ47లో నిషాద్ కుమార్ 2.04 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. అమెరికా అథ్లెట్ రోడెరిక్(2.12 మీటర్లతో) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. 2 మీటర్ల ఎత్తుతో జియార్గి బ్రాంజ్ మెడల్ నెగ్గాడు. రోడెరిక్‌కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం.

తొలి ప్రయత్నంలోనే 1.95 మీటర్ల ఎత్తు దూకిన నిషాద్.. రెండో ప్రయత్నంలో 2 మీటర్లు, మూడో ప్రయత్నంలో 2.04 మీటర్ల ఎత్తును క్లియర్ చేశాడు. మరోవైపు రోడెరిక్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. 2.02 మీటర్లు, 2.06 మీటర్లు, 2.08 మీటర్ల ప్రదర్శనతో ఎప్పటికప్పుడూ నిషాద్‌ను రెండో స్థానానికి నెట్టాడు.
నిషాద్ 2.08 మీటర్ల ఎత్తు ఎగరడంలో విఫలమవడం.. రోడెరిక్ 2.12 మీటర్ల ప్రదర్శన చేయడంతో ఫలితం ఖారారైంది. ఈ విభాగంలో పోటీపడ్డ మరో భారత అథ్లెట్ రాంపాల్(1.95 మీటర్లు) ఏడో స్థానంలో నిలిచాడు.
ప్రీతికి కాంస్యం..
మహిళల 200 మీటర్ల టీ35 పరుగులో ప్రీతి పాల్ కాంస్యం గెలిచింది. ఫైనల్లో ఆమె 30.01 సెకన్లలో రేసు ముగించింది. చైనా స్ప్రింటర్ల జియా(28.15 సెకన్లు), చియాన్‌చిన్(29.09 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.
పారిస్‌లోనే 100 మీటర్ల టీ35 పరుగుల కాంస్యం గెలిచిన ప్రీతి.. పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అవని లేఖరా తర్వాత ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా ప్రీతి రికార్డ్ నమోదు చేసింది.
షట్లర్లు సూపరో సూపర్..
పారాలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకాల వేటలో సాగుతున్నారు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3లో నితేశ్ కుమార్, ఎస్‌ఎల్4లో సుహాస్ ఫైనల్ చేరి కనీసం రజతాలు ఖాయం చేశారు. ఆదివారం సెమీస్‌లో నితేశ్ 21-16, 21-12తో టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్య విజేత, జపాన్‌కు చెందిన డైసుక పుజిహారపై విజయం సాధించాడు.
మరోవైపు ఎస్‌ఎల్4 సెమీస్‌లో టాప్‌సీడ్ సుహాస్ యతిరాజ్ 21-17, 21-12తో సహచర అథ్లెట్ సుకాంత్‌పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5లో తులసిమతి మురుగేశన్ పతకం ఖాయం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications