
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ముంగిట భారత అథ్లెటిక్ టీమ్‌కు గట్టి షాక్ తగిలింది. భారత బళ్లెం వీరుడు, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సంబంధిత సమస్యలతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సత్తా చాటిన నీరజ్ చోప్రా గాయపడ్డాడు. గత ఆదివారం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నీరజ్ చోప్రా 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన రెండో భారత అథ్లెట్‌గా, తొలి అథ్లెటిక్స్ ప్లేయర్‌గా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు.
ఈ విజయంతో నీరజ్ చోప్రాపై అంచనాలు పెరిగిపోయాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకం ఖాయమని అంతా భావించారు. కానీ ఇలా ఫిట్‌నెస్ సమస్యలతో నీరజ్ చోప్రా దూరమవుతాడని ఎవరూ ఊహించలేదు. నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం లేదనే విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) ధృవీకరించింది. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొంది.
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన అనంతరం నీరజ్ తన గాయం గురించి మీడియాతో మాట్లాడాడు. ' పరిస్థితులతో పాటు పోటీ కూడా చాలా కఠినంగా ఉంది. ముందు నుంచి గాలి ఎక్కువగా ఉంది. ఇది నాకు సవాల్‌గా మారింది. మొదటి మూడు త్రోలు అనుకున్న విధంగా రాకపోవడంతో ఒత్తిడి పెరిగింది. అయినా బెస్ట్ ఇస్తాననే నమ్మకం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో అది ఫలించింది. ఒలింపిక్స్ కంటే చాంపియన్‌షిప్ కఠినంగా ఉంటుంది. రికార్డ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
ఏదేమైనా 19 ఏళ్ల తర్వాత దేశానికి సిల్వర్ మెడల్ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని నేను ఆస్వాదిస్తున్నా. నాలుగో త్రో తర్వాత తొడపై పట్టి వేసుకున్నా. దీంతో కొంత బిగుతుగా అనిపించింది. అందుకే చివరి త్రోలు ఫాల్స్ అయ్యాయి. శరీరం కూడా వెచ్చగా అనిపించింది. కామన్వెల్త్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆశిస్తున్నా. స్వర్ణం గెలవడమే నా లక్ష్యం'అని నీరజ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే అతని తొడ కండరాలు పట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు మూడు వారాల పాటు సమయం పడుతుంది.