
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసుపత్రి పాలయ్యాడు. మంగళవారం ఢిల్లీ నుంచి పానిపట్ వరకు దాదాపు 6 గంటలపాటు ఓపెన్ టాప్ వాహనంపై ఊరేగింపులో పాల్గొన్న నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చోప్రా గత కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.
ఇటీవల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఈ కారణంగానే నీరజ్ గైర్హాజరయ్యాడు. అయితే ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం నీరజ్ పాల్గొన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీని కలిసి అభినందనలు పొందాడు.
ఒలింపిక్స్ తర్వాత తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు మంగళవారం వెళ్లిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. పానిపట్‌కు చేరుకున్న అనంతరం నీరజ్ నీరసించడంతో వెంటనే అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నీరజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అతని స్నేహితుడు ఒకరు మీడియాకు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నీరజ్‌కు నెగటివ్ అని తేలిన విషయం తెలిసిందే. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఈటెన్ 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా పసిడి పతకాన్ని ముద్దాడాడు. తద్వారా 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్‌లో తొలి పతకాన్ని అందించాడు. అంతేకాకుండా స్వతంత్ర్య భారతంతో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం గెలిచిన అథ్లెట్‌గా గుర్తింపుపొందాడు. స్వర్ణం సాధించిన నీరజ్‌కు యావత్ దేశం నీరాజనాలు పలికింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ సైతం నీరజ్‌ను ప్రత్యేకంగా సన్మానించి తనకు ఇష్టమైన చుర్మాను తినిపించాడు.
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌కు మొత్తం ఏడు మెడల్స్ వచ్చాయి. మెన్స్ హాకీ టీమ్‌తో పాటు నీరజ్ చోప్రా, పీవీ సింధు, రవికుమార్ దహియా, భజరంగ్ పూనియా, మీరాబాయి ఛాను, లవ్లీనా బోర్గోహైన్ పతకాలు గెలిచారు. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇంతకముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే దీనిని పక్కకు తోస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరింత అద్బుతంగా ఆడింది.