
న్యూఢిల్లీ: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా.. అతి తర్వలోనే 90 మీటర్ల మార్క్ అందుకుంటానని తెలిపాడు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రపంచ చాంపియన్‌లో పతకాన్ని సాధించానని చెప్పాడు. ఆదివారం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్లు విసిరి స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. దీంతో నీరజ్ చోప్రా కూడా 90 మీటర్ల లక్ష్యం అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో 90 మీటర్ల మార్క్‌పై నీరజ్ చోప్రా స్పందించాడు. త్వరలోనే తప్పకుండా సాధిస్తానని వెల్లడించాడు. అయితే దానికంటే ముందు స్థిరంగా రాణించడంపైనే దృష్టిసారించానని తెలిపాడు.
'ఒలింపిక్స్ తర్వాత నా శిక్షణను కాస్త ఆలస్యంగానే ప్రారంభించా. నేను బల్లెం వదిలే విధానం, సమయంపై కృషి చేశా. అందుకే ఈ ఏడాది ఎంతో స్థిరంగా విసరగలుగుతున్నా. ఇప్పుడైతే 90 మీ. మార్క్‌ను అందుకోలేక పోయినా.. దానికి దగ్గరగా వచ్చా. తప్పకుండా అతి త్వరలోనే 90 మీటర్ల దూరం విసురుతా'అని నీరజ్ వెల్లడించాడు. ఫైనల్స్‌లో అండర్సన్ మూడుసార్లు 90 మీ మార్క్‌ను అందుకోవడం విశేషం. అయితే అతడి అత్యుత్తమం 93.07 మీటర్లు. ఇదే గ్రెనెడా దేశ జాతీయ రికార్డు.
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ విజయం మాట్లాడుతూ.. ' పరిస్థితులతో పాటు పోటీ కూడా చాలా కఠినంగా ఉంది. ముందు నుంచి గాలి ఎక్కువగా ఉంది. ఇది నాకు సవాల్‌గా మారింది. మొదటి మూడు త్రోలు అనుకున్న విధంగా రాకపోవడంతో ఒత్తిడి పెరిగింది. అయినా బెస్ట్ ఇస్తాననే నమ్మకం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో అది ఫలించింది. ఒలింపిక్స్ కంటే చాంపియన్‌షిప్ కఠినంగా ఉంటుంది. రికార్డ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
ఏదేమైనా 19 ఏళ్ల తర్వాత దేశానికి సిల్వర్ మెడల్ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని నేను ఆస్వాదిస్తున్నా. నాలుగో త్రో తర్వాత తొడపై పట్టి వేసుకున్నా. దీంతో కొంత బిగుతుగా అనిపించింది. అందుకే చివరి త్రోలు ఫాల్స్ అయ్యాయి. శరీరం కూడా వెచ్చగా అనిపించింది. కామన్వెల్త్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆశిస్తున్నా. స్వర్ణం గెలవడమే నా లక్ష్యం'అని నీరజ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తనతో పాటు పతకాలు గెలిచిన అథ్లెట్లకు నీరజ్ చోప్రా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.