
హైదరాబాద్: నీరజ్ చోప్రా.. ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగిపోతున్నది. 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన ఈ బళ్లెం వీరుడిపై యావత్ భారతం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. స్వతంత్ర భారత్‌లో పసిడి సాధించిన రెండో ఆటగాడిగా నిలిచి ఈ హర్యానా అథ్లెట్‌కు నీరాజనాలు పలుకుతోంది. తన రెండో ప్రయత్నంలోనే బళ్లెంను 87.58 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా భారత్‌కు పతకాన్ని ఖాయం చేశాడు. టోక్యో విశ్వక్రీడల్లో భారత జెండాను రెపరెపలాడించి ఘనమైన ముగింపును అందించాడు. అయితే అతనికి ఈ విజయం ఆ ఒక్క ప్రయత్నంతో దక్కలేదు. దాని వెనుక ఎంతో కఠిన శ్రమ, మరెంతో ఏకాగ్రత ఉంది.
అతని డెడికేషన్, పర్సెవెరెన్స్, డిసీప్లీన్, హార్డ్ వర్క, కమిట్‌మెంటే అతన్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అవును 13 ఏళ్లకే 80 కిలోలతో ఉబయకాయంతో బాధపడిన అతను.. ఈ రోజు బాలీవుడ్ హీరోను తలపిస్తున్నాడంటే నీరజ్ చోప్రా హార్డ్ వర్క్‌ను అర్థం చేసుకోవచ్చు. నచ్చిన ఆటలో రాణించేందుకు నీరజ్.. తనకు ఇష్టమైన స్వీట్లు పక్కనపెట్టాడు. ఎంతలా అంటే.. స్వర్ణం సాధించిన వెంటనే అతని నోటి నుంచి వచ్చిన మాట.. కడుపు నిండా చపాతి చుర్మా తినాలని.
Neeraj Chopra: ఒకటి.. రెండు.. మూడు కాదు ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆహారం విషయంలో అతను ఎంత కఠిన డైట్ మెయింటేన్ చేశాడో.
సాధారణంగా క్రికెట్ పిచ్చిలో ఉన్న మనం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా భావిస్తాం. అందులోనూ తప్పులేదు. ఫిట్‌నెస్ విషయంలో క్రీడకారులకు అతను ఓ దారి చూపాడు. కానీ మన బంగారు కొండ నీరజ్ చోప్రా ఫ్లెక్సిబిలిటీ ముందు విరాట్ కోహ్లీ కూడా పనికిరాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను చూస్తే మీరు కూడా ఆ మాట అనకుండా ఉండలేరు.
ఒలింపిక్స్ ప్రాక్టీస్‌లో భాగంగా అతను షాట్‌పుట్ గుండును పట్టుకొని వెనక్కి వంగుతూ ఉన్న వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. హార్డ్ వర్క్ లేకుండా ఏది దక్కదనే విషయం అందరికి అర్థమైంది. ఆ హార్డ్ వర్క్‌కు పిసరంత అదృష్టం కూడా తోడవ్వడంతో నీరజ్ చోప్రా మన ముందు హీరోలా నిలబడ్డాడు. నీరజ్ భాయ్.. సరిలేరు నీకెవ్వరూ.. నువ్వు ఇలాగే దూసుకుపో!