Tokyo Paralympics: స్వర్ణ విజేత ప్రమోద్ భగత్ జీవితం అందరికీ ఆదర్శం!

టోక్యో: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని పారా అథ్లెట్ ప్రమోద్ భగత్ మరోసారి నిరూపించాడు. టోక్యో వేదికగా జరుగతున్న పారాలింపిక్స్‌లో స్వర్ణంతో సత్తా చాటి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. శనివారం జరిగిన బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్-3 కేటగిరి ఫైనల్లో ప్రమోద్ భగత్ 21-14, 21-17 తేడాతో బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌పై విజయం సాధించి పసిడిని సొంతం చేసుకున్నాడు. 1988 జూన్ 4న ఒడిశాలో జన్మించిన ప్రమోద్ భగత్... చిన్న వయసులోనే పోలియో బారిన పడ్డాడు. పోలియోతో ప్రమోద్ ఎడమకాలు చచ్చుబడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్ తండ్రి అందరిలాగా బాధపడలేదు. తన కొడుకును ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ప్రమోద్ ఎన్నో కష్టాలనోర్చి బ్యాడ్మింటన్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు.
అలా బ్యాడ్మింటన్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ప్రపంచ నెంబర్‌వన్ పారా షట్లర్‌గా ఎదిగాడు. ఆ శ్రమతో టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్-3 కేటగిరీలో ప్రపంచనెంబర్‌వన్‌గా ఎదిగిన ప్రమోద్ భగత్ జీవితం ఇప్పుడు అందరికీ ఆదర్శం.

చిన్నవయసులోనే..
ప్రమోద్ భగత్ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ ఆటకు ఆకర్షితుడయ్యాడు. తన ఇంటి పక్కనవాళ్లు బ్యాడ్మింటన్‌ను ఆడుతుండగా చూసిన ప్రమోద్ దానినే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్‌లో మెళుకువలు నేర్చుకున్న ప్రమోద్ తొలుత జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో టైటిల్స్ కొల్లగొట్టాడు. అనంతరం పారా బ్యాడ్మింటన్‌వైపు అడుగులు వేసిన ప్రమోద్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తాజాగా 2019లో దుబాయ్ వేదికగా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో పోటీ పడిన ప్రమోద్ స్వర్ణం సాధించి జాతిని గర్వించేలా చేశాడు.

ప్రమోద్ భగత్.. రికార్డులు
-SL3 కేటగిరీలో వరల్డ్ నెం .1 పారా-బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రమోద్ భగత్ రికార్డు
-ఐడబ్ల్యూఏఎస్ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్, డబుల్స్ ,మిక్సడ్ డబుల్స్ ఈవెంట్లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం.
-ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు.
-ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్‌లో గోల్డ్, కాంస్య పతకాలు
-2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు.
-RYLA ఇంటర్నేషనల్ చాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు

భారత్14
పారాలింపిక్స్ 2020లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఆదివారంతో ముగియనున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 3 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సాధించింది. టోక్యో విశ్వక్రీడలకు ముందు వరకు జరిగిన పారాలింపిక్స్ క్రీడలన్నింటిలో కలిపి భారత్ 12 పతకాలే నెగ్గగా.. తాజా క్రీడల్లోనే ఆ సంఖ్యను దాటడం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా భారత అథ్లెట్లు సత్తాచాటిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మెడల్స్ సాదించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications