Aman Sehrawat:రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.పారిస్ సమ్మర్ గేమ్స్‌లో అత్యంత పిన్న వయస్కుడైన పురుష రెజ్లర్ అమన్ మంగళవారం తన సెమీఫైనల్ బౌట్‌లో టాప్-సీడ్ రెజ్లర్, జపాన్‌కు చెందిన రీ హిగుచి పై ఓటమిపాలయ్యాడు.
అమన్ సెహ్రావత్ ఎవరు..?
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత్‌కు ఒకే ఒక పతకం వచ్చింది. అది కూడా అమన్ సెహ్రావత్ కాంస్య పతకం దేశానికి అందించాడు. దీంతో గత ఐదేళ్లుగా ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్ పతకం సాధిస్తూ వస్తోంది. ఇక అమన్ సాధించిన ఈ ఘనత గురించి ప్రపంచం చర్చించుకుంటోంది. అసలు అమన్ ఎవరు.. ఏ రాష్ట్రానికి చెందిన వాడు అని భారతీయులు కూడా అమన్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అండర్ 23 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా అమన్ గుర్తింపు పొందాడు. దీంతోనే ఈ యువ రెజ్లర్ వెలుగులోకి వచ్చాడు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లా బిరోహర్ గ్రామంలో 2003 జూలై 16న అమన్ సెహ్రావత్ జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అమన్.. ఆ తర్వాత తన తాతయ్య వద్ద పెరిగాడు. 10 ఏళ్లకే కుస్తీ బరిలోకి దిగి అద్భుతాలు సృష్టించాడు. ఇక తాజాగా ఒలింపిక్స్‌లో భారత్ తరపున మెడల్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అమన్ 21 ఏళ్లకే తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు.
కెరీర్ సాగిందిలా...
2012 ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ రెజ్లింగ్‌లో రజత పతకాన్ని సాధించడంతో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నాడు అమన్.10 ఏళ్ల వయసులో నార్త్ ఢిల్లీలోని ఛత్రసాయి స్టేడియంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక అక్కడ ప్రారంభమైన అమన్ రెజ్లింగ్ ఏకంగా ఒలింపిక్స్‌లో మెడల్ సాధించే వరకు వెళ్లింది. 2021లో సెహ్రావత్ తొలి నేషనల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 2022లో అండర్ 23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించాడు.అండర్ 23 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మరో బంగారు పతకం సాధించిన అమన్.. 2023 ఏప్రిలోలో అస్తానాలో జరిగిన ఆసియా రెజ్లింగ్‌లో పసిడి పతకం సాధించాడు. జనవరి 2024లో జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో 57కేజీల ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు.
ఇస్తాంబుల్‌లో జరిగిన 2024 వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇక ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో ప్యూర్టోరికో రెజ్లర్ క్రూజ్ పై 13-5 తేడాతో విజయం సాధించి కాంస్య పతకం దక్కించుకున్నాడు.