Maria Andrejczyk: గెలిచింది రజతమే.. కానీ మనసు మాత్రం బంగారం!

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో పోలండ్ అథ్లెట్ మరియా ఆండ్రెజిక్ రజతమే గెలిచింది. కానీ ఆమె మనసు మాత్రం బంగారం. కొన్నేళ్ల కష్టానికి లభించిన ప్రతిఫలాన్ని త్యాగం చేసేందుకు కూడా ఆమె వెనుకాడలేదు. ఎనిమిది నెలల పసివాడి గుండె కోసం ఎన్నో ఎళ్లుగా కష్టపడి సాధించిన పతకాన్ని వేలానికి పెట్టింది.
మహిళల జావెలిన్‌త్రో ఈవెంట్‌లో ఈటెను 64.61 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచింది. వాస్తవానికి ఆమె రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. అందుకే ఆమెకి టోక్యోలో లభించిన ఈ పతకం ఎంతో ప్రత్యేకం. ఐదేళ్ల కఠిన శ్రమకు దక్కిన ప్రతిఫలం అది. అయితే ఓ ఎనిమిది నెలల పసికందు గుండెకు సమస్య ఏర్పడిందని తెలిసి మరియా తల్లడిల్లింది.
తనకు తోచిన సాయం చేయాలనుకుంది. శస్త్రచికిత్స కోసం ఆ చిన్నారిని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్పత్రికి పంపించేందుకు నడుం బిగించింది. తను సాధించిన రజత పతకాన్ని వేలానికి పెట్టింది. పొలాండ్ అబ్కా పొల్స్‌క కన్వీనియెన్స్ స్టోర్ కంపెనీ 1,25,000 డాలర్లకు ఆ పతకాన్ని దక్కించుకొంది.
ఆ అథ్లెట్ బంగారు హృదయాన్ని గౌరవిస్తూ ఆ కంపెనీ ఉదారత ప్రదర్శించింది. వేలంలో గెలిచిన ఆ రజత పతకాన్ని తిరిగి ఆమెకే ఇచ్చేసింది. పసిహృదయానికి అవసరమైన డబ్బును ఇస్తామని వెల్లడించింది. 'ఇది నా మొదటి విరాళాల సేకరణ. పతకం వేలం వేయడమే సరైందని నాకనిపించింది. ఆ పసివాడు ఇప్పటికే చికిత్స కోసం బయల్దేరాడు' అని మరియా తెలిపింది. కాగా, ఆ పసివాడి పేరు మిలోస్‌జెక్ అని తెలిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications