భారత మహిళా షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన తొలి షూటర్‌గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో మను భాకర్ అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరింది.
580 పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచి మెడల్ ఈవెంట్‌కు అర్హత సాధించింది. హంగరీ షూటర్ వీ మేజర్, సౌత్ కొరియా షూటర్ వైజే ఓహ్ 582 పాయింట్లతో తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే ఫైనల్లో మను భాకర్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే కాంస్య పతకం సొంతమవుతోంది. ఈ తుది పోరులో వీ మేజర్, వైజే ఓహ్‌తో పాటు మనుభాకర్, చైనాకు చెందిన ఎక్స్.లీ పోటీపడనున్నారు.

20 ఏళ్ల క్రితం 2004 అథెన్స్ ఒలింపిక్స్‌లో సుమా షిరుర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్ చేరింది. ఇన్నాళ్లకు మనుభాకర్ ఫైనల్ చేరింది. ఆదివారం ఫైనల్లో ఇదే జోరును కొనసాగించి మనుభాకర్ పతకాన్ని అందుకుంటే సరికొత్త చరిత్రను లిఖించనుంది. మరో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ 573 పాయింట్స్‌తో 15వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
మిగతా పోటీల్లో నిరాశే..
అంతకుముందు జరిగిన షూటింగ్ ఈవెంట్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ విభాగంలో ఒక్క పాయింటుతో మెడల్ రేసుకు దూరమైన భారత్.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్‌కు చేరే అర్హత పాయింట్లు సాధించినప్పటికీ దురదృష్టవశాత్తు ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.
శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ విభాగంలో 628.7 పాయింట్లతో అర్జున్ బబుతా-రమిత ఆరో స్థానంలో, వలరివన్-సందీప్ సింగ్ 623.6 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. అయితే నాలుగో స్థానంలో నిలిచిన జర్మనీ ద్వయానికి మనోళ్లకు మధ్య అంతరం ఒక్క పాయింటు మాత్రమే. మరో పాయింటు సాధించి ఉంటే భారత్ కాంస్య పతక పోరులో నిలిచేది.
ఖాతా తెరిచిన చైనా..
చైనా (632.2), కొరియా (631.4), కజకిస్థాన్ (630.8), జర్మనీ (629.7) టాప్-4లో నిలిచాయి. స్వర్ణం కోసం చైనా, దక్షిణ కొరియా పోటీపడగా.. చైనా జంట హువాంగ్ యుటింగ్-షెంగ్ లిహావో కొరియా ద్వయం కిమ్ జిహ్యోన్-పార్క్ హజున్‌పై 16-12తో పైచేయి సాధించి గోల్డ్ సాధించింది. కజికిస్థాన్ కాంస్య పతకాన్ని పొందింది.
కాగా, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ సరబ్‌జ్యోత్ 577 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మరో షూటర్ అర్జున్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమయ్యాడు. టాప్ 8లో నిలిచిన వాళ్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
వెంటాడిన దురదృష్టం
అయితే ఎనిమిదో స్థానంలో నిలిచిన జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్ కూడా సరబ్‌జ్యోత్‌తో సమానంగా 577 పాయింట్లే సాధించాడు. కానీ సరబ్‌జ్యోత్ కంటే రాబిన్ ఒక్క ఇన్నర్-10ను ఎక్కువగా సాధించాడు. జర్మనీ షూటర్ 18 ఇన్నర్ టెన్స్ సాధించగా, మన షూటర్ 17 సాధించాడు. దీంతో షూటింగ్ నిబంధనల ప్రకారం ఇన్నర్ టెన్స్ ఎక్కువగా ఉన్న జర్మనీ షూటర్‌కు ఫైనల్స్‌కు అవకాశం ఇచ్చారు. గత కొంతకాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న సరబ్‌జ్యోత్ తప్పక పతకం సాధిస్తాడనే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు.