దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన ఖేల్ రత్న అవార్డుల నామినేషన్లలో రాజకీయం చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనుభాకర్‌కు ఖేల్ రత్న నామినేషన్లలో చోటు దక్కలేదని తెలుస్తోంది.
ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయినా ఆమెకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్ రత్న నామినేషన్లలో చోటు దక్కకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ అవార్డు కోసం మను భాకర్ దరఖాస్తు చేసుకోలేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

అయితే ఈ వాదనను మను భాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ వ్యతిరేకించారు. ఖేల్ రత్న కోసం దరఖాస్తు చేసామని వెల్లడించారు.
'ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన అథ్లెట్ కూడా అవార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలా? ఇదేనా మీరు అథ్లెట్లను ప్రోత్సహించే విధానం? ప్రభుత్వంలోని ఓ అధికారి అన్ని అవార్డల నామినేషన్స్ నిర్ణయించారు. మిగతా కమిటీ సభ్యులు సైలెంట్ అయిపోయారు.
అయినా మేం దరఖాస్తు చేసుకున్నాం. కానీ కమిటీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇలాగైతే తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనమని తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహిస్తారు?'అని మనుభాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ అసహనం వ్యక్తం చేశారు. ఇక మను భాకర్‌కు 2020లో అర్జున అవార్డ్ వరించింది. మను భాకర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండటం, పారిస్ ఒలింపిక్స్ తర్వాత రాహుల్ గాంధీని కలవడంతోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమెను క్రీడా పురస్కారల్లో నామినేట్ చేయలేదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
గతంలో అథ్లెట్లు దరఖాస్తు చేసుకోకున్నా క్రీడా పురస్కారాలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది మహమ్మద్ షమీ దరఖాస్తు చేసుకోకపోయినా బీసీసీఐ సిఫార్సుతో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించిందని కామెంట్ చేస్తున్నారు. మను భాకర్‌ను కూడా షూటింగ్ సమాఖ్య సిఫార్సు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం హాకీ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లను ఖేల్ రత్న అవార్డు కోసం నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.
జాతీయ క్రీడా పురస్కారాలను ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోందన్న విషయం తెలిసిందే. భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజు అయిన ఆగస్టు 29న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో క్రీడాకారులకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేస్తారు.