భారత స్టార్ జావెలిన్ త్రోయర్, గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. లుసానె డైమండ్ లీగ్ 2024లో ఈటెను 89.49 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో నీరజ్ చోప్రాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ టోర్నీలోనూ అతని 90 మీటర్ల కల నెరవేరలేదు.
గ్రెనెడా జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. జర్మన్ ప్లేయర్ వెబర్ జులియన్ 87.08 మీటర్లతో మూడో స్థానాన్ని పొందాడు. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. గాయం కారణంగానే అతను బరిలోకి దిగలేదని తెలుస్తోంది.

తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా 82.10 మీటర్లు మాత్రమే విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. తర్వాత వరుసగా 83.21, 83.13, 85.58 మీటర్లు విసిరాడు. చివరి ప్రయత్నంలో గ్రెనెడా ప్లేయర్ జావెలిన్‌ను ఏకంగా 90.61 మీటర్లు విసిరి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. దాంతో నీరజ్ చోప్రా తన శక్తినంత కూడదీసుకొని 89.49 మీటర్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
నీరజ్ చోప్రా కెరీర్‌లోనే ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ 2022లో నీరజ్ చోప్రా 89.94 మీటర్లు విసిరాడు. ఇదే నీరజ్ చోప్రా కెరీర్ బెస్ట్‌గా ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా 89.45 మీటర్లు విసిరి రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.
డైమండ్ లీగ్ 2022లో 87.66 మీటర్లు విసిరి స్వర్ణం దక్కించుకున్న నీరజ్ చోప్రా.. గతేడాది 89.08 మీటర్లతో మెరుగైన ప్రదర్శన చేశాడు.