
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ వివాదాస్పద రీతిలో ఆదివారం ముగిసిన ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం భారత చెస్‌కే గోల్డెన్ మూమెంట్ అని భారత చెస్ క్రీడాకారిని, తెలుగు బిడ్డ కోనేరు హంపి తెలిపింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసింది.
'భారత చెస్ ఫ్రెటర్నిటీకి ఇదో గోల్డెన్ మూమెంట్. దేశంలో చాలా మంది యువతి, యువకులు చెస్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకునేలా ఈ విజయం స్పూర్తిని కలిగిస్తుందనుకుంటున్నా.'అని హంపీ చెప్పుకొచ్చింది.
రెండు మ్యాచ్‌లతో కూడిన ఈ ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ఆరు గేమ్‌లు 'డ్రా'గా ముగిశాయి. దాంతో ఇరు జట్లూ 3-3తో సమంగా నిలిచాయి. ఫైనల్లోని రెండో మ్యాచ్ సందర్భంగా ఇద్దరు భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, దివ్య దేశ్‌ముఖ్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం.... చివరకు సమయాభావం వల్ల వారు గేమ్‌లను వదులుకోవాల్సి వచ్చింది. దాంతో రష్యా 4.5-1.5తో ఈ మ్యాచ్‌ను గెలిచింది. మ్యాచ్‌లో విజయానికి 2 పాయింట్లు, 'డ్రా' అయితే చెరో పాయింట్ ఇస్తారు.
ఫలితంగా రష్యా ఓవరాల్‌గా 3-1తో విజయం సాధించినట్లయింది. అయితే విజయావకాశాలు ఉన్నదశలో ఇంటర్నెట్ కనెక్షన్ పోయిన కారణంగానే తాము గేమ్‌లు కోల్పోవాల్సి వచ్చిందని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అప్పీల్ కమిటీకి భారత్ అప్పీల్ చేసింది. దివ్య గెలిచే స్థితిలో, నిహాల్ 'డ్రా' చేసుకునే స్థితిలో ఉన్నపుడు ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం, ఇంటర్నెట్ పునరుద్ధరణ జరిగేసరికి గేమ్ నిర్ణీత సమయం అయిపోవడంతో వారిద్దరు ఓడిపోయినట్లు ప్రకటించారు
అప్పీల్‌ను విచారించిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్‌కోవిచ్ (రష్యా) అన్ని అంశాలను పరిశీలించి, భారత అప్పీల్ సరైనదేనని భావిస్తూ రెండో మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి మ్యాచ్ సమంగా ముగియడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. స్వర్ణం గెలిచిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఉన్నారు.
టోర్నీ మొత్తంలో హంపి, హారిక నిలకడగా ఆడి భారత్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హంపి టైబ్రేక్ గేమ్‌లో గెలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరం, ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, భక్తి కులకర్ణి, వంతిక అగర్వాల్ మిగతా సభ్యులుగా ఉన్నారు.