దేశమా సిగ్గుపడు.. ఇటుకలు మోస్తున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్!

న్యూఢిల్లీ: కరోనా తెచ్చిన కష్టంతో ఓ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్ కూలిగా మారింది. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సిన ఆమె.. బతుకు దెరువు కోసం ఇటుక బట్టీల్లో పనిచేస్తోంది. కరోనా వల్ల కుటుంబ ఆర్థిక స్థితి చితికి పోవడంతో ఈ మట్టిలో మాణిక్యం జీవితం వీధిన పడింది. అయినా మానసిక స్థైర్యం కోల్పోకుండా ఇటుక బట్టిల్లో కూలి పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది.
ఆమె ఎవరో కూడా జార్ఖండ్‌కు చెందిన సంగీత కుమారీ సోరేన్. 2018-19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్-17,అండర్-18 ఫుట్‌బాల్ టోర్నీల్లో సంగీత భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించింది. మంచి ప్రదర్శనతో భారత సీనియర్ జట్టుకు సెలక్ట్ అయ్యింది

కరోనా తెచ్చిన కష్టం..
జట్టులో చేరుతుందనుకున్న సమయంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించడంతో ఆమె ఆశలన్నీ గల్లంతయ్యాయి. కుటుంబం ఆర్థిక స్థితి బాగోలేదు. పైగా ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకు.. లాక్‌డౌన్ ప్రభావంతో పని దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ భారాన్ని మోస్తోంది. తల్లితో కలిసి బట్టీలో ఇటుకలు మోసే పనిచేస్తోంది. ఫుట్‌బాల్ కెప్టెన్‌గా రాణించిన సంగీతకు ప్రోత్సాహం అందిస్తామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్వయంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గతంలో ప్రకటించాడు. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు.

పట్టించుకోని అధికారులు..
స్థానిక ఎమ్మెల్యే కూడా తమను సంప్రదించలేదని ఆమె తండ్రి దూబా వాపోయాడు. జార్ఖండ్‌లో మంచి ప్లేయర్స్ ఉన్నారని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని సంగీత అంటోంది. అయినప్పటికీ తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఫుట్ బాల్‌ను వదిలేది లేదని చెబుతోంది. పనికి పోయే ముందు రోజూ ఉదయం పొలాల్లో సంగీత తన ఆటకు మెరుగులు దిద్దుకుంటోంది. ఇక సంగీత దయనీయ గాథను స్థానిక హిందీ పత్రిక ప్రచురించడంతో లోకానికి తెలిసింది.
కేంద్ర మంత్రి ట్వీట్..
కొందరు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజికి ట్వీట్ చేయడంతో ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ నిచ్చారు. 'అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఫుట్‌బాల్ ప్లేయర్ సంగీత సోరెన్ గురించి నాకు తెలిసింది. కరోనా కారణంగా ఆమె అర్థిక ఇబ్బందుల్లో ఉంది. మా కార్యాలయం ఆమెను సంప్రదించింది. త్వరలోనే అర్థిక సాయాన్ని అందిస్తాం. అథ్లెట్లకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించడమే మా ప్రాధాన్యత.'అని రిజిజు ట్వీట్ చేశారు.

నెటిజన్లు ఫైర్..
సంగీత సోరెన్ దయనీయ కథనంపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. 'దేశమా సిగ్గు పడు.. ప్రతిభావంతులైన క్రీడాకారులకు సాయం అందించే నాదులే లేడు'అని కామెంట్ చేశారు. పేద కుటుంబం నుంచి వచ్చి వేల కోట్లు సంపాందించిన జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ అయినా ఇలాంటి ప్లేయర్లకు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ప్రతిభావంతులు ఇంకా ఎంత మంది దుర్భర జీవితాలు గడుపుతున్నారో తెలుసుకుని అందరికి సాయం అందించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications