
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్‌ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే సమ్మర్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తాచాటుతారని ఆయన ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ధీమా వ్యక్తం చేశారు. 'వరల్డ్ ర్యాంకింగ్స్ ద్వారా టోక్యో ఒలింపిక్స్ 100, 200 మీటర్ల కేటగిరీల్లో అర్హత సాధించిన ద్యుతీ చంద్‌కు అభినందనలు.
ఈ ఒలింపిక్స్‌లో భాతర ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారనే నమ్మకం నాకుంది'అని కిరణ్ రిజిజు తెలిపారు. ఇక వరల్డ్ ర్యాంకింగ్స్ ద్వారా ద్యుతీకి 100 మీటర్లు, 200 మీటర్ల కెటగిరీల్లో ఒలింపిక్స్ బెర్త్ దక్కిన విషయం తెలిసిందే. ఈ రెండు కేటగిరీల్లో 56 మంది అథ్లెట్లకు పోటీ పడే అవకాశం ఇవ్వడంతో ద్యుతీకి అవకాశం లభించింది.
100 మీటర్ల విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 41వ స్థానంలో ఉన్న ద్యుతీ.. 200 మీటర్ల విభాగంలో 50వ స్థానంలో ఉంది. దాంతో ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ మార్క్‌తో సంబంధం లేకుండా ఆటోమెటిక్ కోటా ద్వారా ద్యుతీ అర్హత సాధించింది. పాటియాలాలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 4లో ఆటోమేటిక్ ఒలింపిక్ అర్హత సమయాన్ని 0.02 సెకన్ల తేడాతో ద్యుతీ కోల్పోయింది. ద్యుతీతో పాటు జావెలిన్ త్రోయర్ అను రాణి, 400 మీటర్ల హర్డ్లర్ జబీర్ సైతం క్వాలిఫికేషన్ మార్క్‌తో సంబంధం లేకుండా ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్నారు. ఇక జూలై 28 నుంచి జపాన్‌లోని టోక్యో వేదికగా ఈ సమ్మర్ గేమ్స్‌కు తెరలేవనుంది.
దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు స్ప్రింటర్ ద్యుతీ చంద్ పేరును ఒడిశా ప్రభుత్వం గత మంగళవారం సిఫార్సు చేసింది. 'ఖేల్‌రత్న అవార్డుకు నా పేరు నామినేట్ చేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారికి ధన్యవాదాలు. నా మీద మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా' అని ద్యుతీ చంద్ పేర్కొంది. 2018 ఆసియా గేమ్స్‌లో 100 మీ, 200 మీ ఈవెంట్లో రజత పతకం గెలుపొందిన ద్యుతీని గతేడాది అర్జున అవార్డు వరించిన విషయం తెలిసిందే.