తెలుగు తేజం, భారత హర్డిల్ క్వీన్ జ్యోతి యర్రాజీ మరోసారి సత్తా చాటింది. తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్-2025లో బంగారు పతకం సాధించింది. శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 12.99 సెకన్లలో రేసును పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. చివరి రెండు హర్డిల్స్ వరకు వెనుకంజలో ఉన్న జ్యోతి యర్రాజీ రెప్పపాటు సమయంలో అందరినీ దాటుకుంటూ వచ్చి విజేతగా నిలిచింది. ప్రస్తుతం జ్యోతి యర్రాజీ రేసుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బంగారు పతకం సాధించిన జ్యోతి యర్రాజీకి తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.
జ్యోతితో పాటు పూజ, తేజస్ శిర్సే, అబ్దుల్లా అబూబాకర్ బంగారు పతకాలు సాధించారు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ రేసును తేజస్ శిర్సే 13.52 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది అతని కెరీర్ బెస్ట్ టైమింగ్ కావడం విశేషం. పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ తన మూడో ప్రయత్నంలో 16.21 మీటర్లు దూకి బంగారు పతకం గెలిచాడు. మహిళల 1500 మీటర్ల రన్నింగ్ ఈవెంట్‌లో పూజ 4:11.65 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో నాలుగు బంగారు పతకాలు చేరాయి. ఈ మెడల్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

జ్యోతి యర్రాజీ సూపర్ ఫామ్‌లో ఉంది. ఇటీవల సౌత్‌కొరియా వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ జ్యోతి యర్రాజీ గోల్డ్ మెడల్ సాధించింది. ఈ టోర్నీలో 100 మీటర్ల హర్డిల్స్‌ను జ్యోతి యర్రాజీ 12.96 సెకన్లలోనే పూర్తి చేసింది.
కేరళ వేదికగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ 2025 పోటీల్లోనూ జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధించింది. ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన నేషనల్ గేమ్స్‌లోనూ జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌తో పాటు 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలు గెలిచింది.
Athletics, Taiwan Athletics Open: Jyothi Yarraji prevails and conquers Taipei city with her top end speed that she unleashed after the 7th hurdle yet again like she did in Gumi.. Ckocks 12.99s to win a tough 100mH final at the WACT🥉meet in Taipei!
— Vishank Razdan (@VishankRazdan) June 7, 2025
Brilliant run, Jyothi!
👏🇮🇳🥇 pic.twitter.com/E13Lw6Xd3N