
టోక్యో: కరోనా వైరస్ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ 2020ను ఏడాది పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్ ప్రభుత్వానికి సూచించారు. కానీ ఒలింపిక్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇప్పుడు వాయిదా వేయడం కుదరదని నిర్వాహకులు అమెరికా అధ్యక్షుడికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యోషిహిదే సుగా శుక్రవారం మీడియాకు తెలిపారు.
అయితే ఈ విషయమై జపాన్ ప్రధాని షింజో అబేతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడినట్లు వస్తున్న వార్తలను ఆయన ధృవీకరించలేదు.. కొట్టిపారేయలేదు. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఇద్దరూ సుమారు 50 నిమిషాలు మాట్లాడుకున్నారని సుగా తెలిపారు. ప్రభుత్వ సీనియర్ ప్రతినిధిగా త్వరలోనే దీనిపై పూర్తి సమాచారం అందజేస్తానన్నారు.
'నేను ఉన్నప్పుడైతే జపాన్, అమెరికాకు సంబంధించిన రవాణ ఆంక్షలపై చర్చ జరగలేదు. వాయిదా వేయాలని ట్రంప్ సూచించినట్లు తెలుసు. కానీ మేం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ), ఆర్గనైజింగ్ కమిటీతో కలిసి ప్రణాళిక ప్రకారం ఒలింపిక్స్ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.' అని సుగా పేర్కొన్నారు.
మరోవైపు ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో అథ్లెట్లు పాల్గొంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడలను వాయిదా వేయాలని ట్రంప్ గురువారం టోక్యో అధికారులకు సూచించారు. ప్రేక్షకులు లేకపోతే అవి ఒలింపిక్స్ క్రీడల్లా ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.
ఓ వైపు కరోనా వైరస్ భయం వెంటాడుతున్నా.. టోక్యో ఒలింపిక్స్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. ఈ ప్రాణాంతక వైరస్ దెబ్బకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడుతుండటంతో ఒలింపిక్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా అనే సందేహాల మధ్య ఒలింపిక్స్ తొలి ఘట్టాన్ని నిర్వహించారు.
ఒలింపిక్స్ పుట్టినిల్లు ఒలింపియా నుంచి టోక్యో ఒలింపిక్ జ్యోతి గురువారం తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. పురాతన పుజారి వేషంలో ఉన్న గ్రీకు నటి.. సంప్రదాయబద్దంగా సూర్యకిరణాలను కాన్‌కేవ్ మిర్రర్‌పై ప్రసరింపజేసి పుట్టించిన వేడి నుంచి కాగడను ముట్టించింది. దానిని రియో ఒలింపిక్స్ షూటింగ్‌లో గ్రీస్‌కు గోల్డ్ మెడల్ సాధించిపెట్టిన అన్నా కొరాకైకు అందించింది. వరల్డ్‌లో ఇలా టార్చ్ అందుకున్న తొలి మహిళగా కొరాకై చరిత్రకెక్కింది. అనంతరం కొరాకై.. ఆ టార్చ్ సాయంతో మిజుకి నొగౌచి చేతిలో ఉన్న టార్చ్‌ను వెలిగించింది. ఇలా వెలిగించడాన్ని టార్చ్ కిస్ అంటారు. దీంతో టార్చ్ రిలే అధికారికంగా మొదలైంది.
ఈ జ్యోతి వారం రోజుల పాటు గ్రీసు దేశంలోని 37 నగరాలు, 15 చారిత్రక ప్రదేశాల మీదుగా... దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అనంతరం ఈ నెల 19న జపాన్‌లోని ఫుకుషిమాకు చేరుతుంది. అక్కడి నుంచి ఒలింపిక్స్ జరిగే టోక్యోకు చేరుతుంది. అట్టహాసంగా జరగాల్సిన ఈ జ్యోతి ప్రజ్వలన ప్రారంభ వేడుకలను కరోనా దెబ్బతో ప్రేక్షకుల్లేకుండా నిర్వహించారు. ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జపాన్ ఆర్గనైజర్స్, జర్నలిస్ట్‌లు అంతా కలిపి ఓ 100 మందితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.