తల్లి కావడం ఆమె తప్పా?.. వినేష్ ఫోగట్ సస్పెన్షన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం!
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి కావడమే ఆమె చేసిన తప్పా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వినేష్ ఫోగట్ అర్హతను అంచనా వేసేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది బాబుకు జన్మనిచ్చిన వినేష్ ఫోగట్ తిరిగి రెజ్లింగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వినేష్ ఫోగట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
మాతృత్వానికి ఇచ్చే గౌరవం ఇదేనా?
చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, తేజస్ కరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. డబ్ల్యూఎఫ్‌ఐ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రతీకార చర్యలు ఉన్నాయా? అనే సందేహాలను ధర్మాసనం వ్యక్తం చేసింది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో డబ్ల్యూఎఫ్‌ఐ కక్షసాధింపు ధోరణి వీడాలని హెచ్చరించింది.
'భారత్‌లో మాతృత్వానికి ఎంతో గొప్ప గౌరవం ఉంది. ఆమె జూలై 2025లో తల్లి అయ్యారు. ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఖ్యాతి తెచ్చిన రెజ్లర్ తల్లి అయితే.. అది ఆమె కెరీర్‌కు నష్టంగా మారాలా? ఈ నిబంధనలను చూస్తుంటే చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఇది క్రీడల ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదు.' అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌కు అనుమతించండి
మే 30-31 తేదీలలో జరగనున్న ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేష్ ఫోగట్‌కు అవకాశం ఇవ్వాలని కోర్టు సూచించింది. అంతకుముందు మే 18న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వినేష్ ఈ అప్పీల్ దాఖలు చేశారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నిబంధనలలో కొన్ని సడలింపులు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలపగా.. 'నిపుణుల కమిటీతో ఆమె ఫిట్‌నెస్, అవకాశాలను అంచనా వేయించి, ఆమె ట్రయల్స్‌లో పాల్గొనేలా చూడాలి'అని ధర్మాసనం ఆదేశించింది.
జాతీయ అవమానం అనే పదంపై ఆగ్రహం..
డబ్ల్యూఎఫ్‌ఐ జారీ చేసిన షోకాజ్ నోటీసులో.. గత పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ అనర్హతకు గురికావడాన్ని జాతీయ అవమానంగా పేర్కొనడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. వినేష్ తరపు సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. మే 9 నాటి ఈ నోటీసు గోండాలో జరిగే పోటీకి కేవలం ఒకరోజు ముందు మాత్రమే ఇచ్చారని, ఆమెను ఎలాగైనా పోటీల నుంచి తప్పించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని తెలిపారు.
అసలు వివాదం ఏంటి?
డబ్ల్యూఎఫ్‌ఐ రూల్స్ ప్రకారం.. యాంటి డోపింగ్ రూల్స్ కింద రీఎంట్రీ ఇచ్చే అథ్లెట్లు 6 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం వినేష్ ఫోగట్ ఈ ఏడాది జూన్ 26 వరకు దేశీయ టోర్నీలు ఆడేందుకు వీల్లేదని ఫెడరేషన్ వాదిస్తోంది. ఈ వాదనను పట్టించుకోకుండా వినేష్ గోండా వేదికగా జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది.
మూడేళ్ల క్రితం 2023లో అప్పటి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మహిళా రెజ్లర్లు నిర్వహించిన భారీ నిరసనల్లో వినేష్ ఫోగట్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్, కేవలం 100 గ్రాముల అదనపు బరువు కారణంగా దురదృష్టవశాత్తూ అనర్హతకు గురయ్యారు. ఆతర్వాత రెజ్లింగ్‌కు దూరమైన వినేష్ ఫోగట్..ఓ బాబుకు జన్మనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications