పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మరో పతకాన్ని గెలిచింది. కాంస్యంతో తొలి మెడల్ అందించిన భారత షూటర్ మను భాకర్.. మరోసారి తన పిస్టల్‌తో గర్జించింది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో దక్షిణ కొరియా ద్వయం జుయీ లీ- వోన్షోలీపై భారత షూటర్లు 16-10తో విజయం సాధించారు.
చరిత్ర సృష్టించిన మను భాకర్
ఈ క్రమంలో ఓ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను బాకర్ ఘన చరిత్ర సృష్టించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ మను బాకర్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.

అలాగే ఒలింపిక్స్‌లో మొత్తంగా రెండు పతకాలు సాధించిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. 124 ఏళ్ల రికార్డ్‌ను మను భాకర్ తిరగరాసింది. 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి రెండు పతకాలు సాధించిన అథ్లెట్లు ముగ్గురే ముగ్గురు కావడం గమనార్హం.
రెజ్లర్ సుశీల్ కుమార్..
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించాడు. 66 కేజీల విభాగంలో పోటీ పడిన సుశీల్ కుమార్ బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
పీవీ సింధు..
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం రెండు మెడల్స్ సాధించి మూడో పతకంపై కన్నేసింది. రియో ఒలింపిక్స్ 2016లో రజతం సాధించిన సింధు.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఈ సారి బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన సింధు.. తన క్యాంపైన్‌ను ఘనంగా ప్రారంభించింది.