న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయకపోతే అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతామని భారత రెజర్లు హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ భారత రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారి నిరసనకు రైతు సంఘూలు కూడా మద్దతు తెలిపాయి.
ఈ తరుణంలో భారత ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో అంతర్జాతీయంగా పోరాడుతామని తెలిపారు. ఇతర దేశాల ఒలింపిక్ పతక విజేతలు, అథ్లెట్లను సంప్రదించడం ద్వారా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన తమ నిరసనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

'ఈ నిరసనను మేం ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం. ఇతర దేశాల్లో ఒలింపియన్లు, ఒలింపిక్ పతక విజేతలను సంప్రదిస్తాం. మద్దతు కోసం లేఖలు రాస్తాం'' అని భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపింది. కొందరు తమ నిరసనను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
''కొందరు అనామక మహిళలు మా నిరసన వేదిక వద్ద నిద్రించడానికి ప్రయత్నించారు. మాకు తెలియని వారిని మా టెంట్ లోపలికి పంపిస్తున్నారు. దీని వల్ల మా పోరాటానికి చెడ్డ పేరు వస్తుంది'' అని వినేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ''బ్రిజ్‌భూషణ్‌పై మే 21 లోపు చర్యలు తీసుకోవాలన్నది మా డిమాండ్. లేదంటే మా నిరసనపై పెద్ద నిర్ణయం తీసుకుంటాం'' అని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించింది.