
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి ఆర్చరీ జంట దీపికా కుమారి, అతాను దాస్‌ల వివాహానికి ముహూర్తం కుదిరింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే ఈ నెల 30న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగినా... అనేక కారణాలతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గత సంవత్సరమే పెళ్లి చేసుకోవాలనుకున్నా తీరికలేని షెడ్యూల్ కారణంగా కుదర్లేదు. దాంతో టోక్యో ఒలింపిక్స్ ముగియగానే ఒకటి కావాలని భావించారు. అయితే కోవిడ్-19 కారణంగా ఒలింపిక్స్ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. దీంతో పెళ్లి చేసుకోవాల్సిందేనని ఈ ఆర్చరీ జంట నిశ్చయించుకుంది. కరోనాతో కఠిన నిబంధనల మధ్య తక్కువ మంది అతిథులతోనే చేసుకోవాల్సి వస్తున్నా... ఇక వాయిదా వేసే పరిస్థితి లేదని, పెళ్లికి ఇంతకంటే సరైన సమయం ఉండదని దీపిక వెల్లడించింది.
ఇక ఇప్పటికే పెళ్లి గురించి చాలా తేదీలు అనుకున్నామని,కానీ కుదరలేదని అతాను దాస్ తెలిపాడు. ఇక తాము ఒక్కటవ్వడాని ఇదే సరైన సమయమని తమ తల్లిదండ్రులకు చెప్పినట్లు పేర్కొన్నాడు. ముందుగా సెప్టెంబర్‌లో అనుకున్నామని కానీ, అప్పటి వరకు మళ్లీ ఆటలు పున:ప్రారంభయ్యే అవకాశం ఉండటంతో తాము సిద్దంగా ఉండాలని ఈ నెలలోనే పెట్టుకున్నామన్నాడు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అత్యంత సన్నిహితుల మధ్యే పెళ్లి చేసుకుంటామన్నాడు.
అర్జున అవార్డు గ్రహితైన దీపిక..భారత్ ఆర్చరీ టీమ్ విభాగం తరఫున ఎన్నో మెడల్స్ గెలిచింది. 2010 కామన్వెల్త్ గేమ్స్ రికర్వ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో బంగారు పతకం సాధించింది. 2012 ఆర్చరీ వరల్డ్ కప్ విభాగంలోను గోల్డ్ నెగ్గిన దీపిక.. 2014, 13 ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ విభాగాల్లో పసిడి నెగ్గింది. ఇక అతాను దాస్ 2019 ఆర్చరీ ప్రపంచకప్ చాంపియన్ షిప్ సిల్వర్ మెడల్ గెలిచిన పరుషుల జట్టులో సభ్యుడు. గతేడా బ్యాంకాగ్ వేదికగా జరిగి ఆసియా ఆర్చరీ చాంపియన్ షిప్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు.