యావత్ భారత్ 77వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న వేళ.. దేశం గర్వించదగ్గ మరో విజయం లడఖ్ మంచు పర్వతాల నుంచి వినిపిస్తోంది. దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే 'లడఖ్ స్కౌట్స్'.. ఇప్పుడు ఐస్ హాకీ క్రీడలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు నడుం బిగించారు.
ప్రస్తుతం లేహ్ (లడఖ్) వేదికగా జరుగుతున్న 6వ 'ఖేలో ఇండియా వింటర్ గేమ్స్' (KIWG 2026)లో లడఖ్ స్కౌట్స్ ప్రతినిధులు 'ఆర్మీ' పేరుతో బరిలోకి దిగి అజేయంగా నిలుస్తున్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే పురుషుల ఫైనల్స్‌లో చండీగఢ్‌తో తలపడేందుకు ఆర్మీ టీమ్ సిద్ధమైంది. కేవలం గెలవడమే కాదు, ఈ క్రీడను దేశవ్యాప్తం చేయడమే వారి ప్రధాన లక్ష్యం.
1970వ సంవత్సరంలో కేవలం సరదా కోసం ఐస్ హాకీ ఆడటం ప్రారంభించిన లడఖ్ స్కౌట్స్, 1980 నాటికి దాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఒకప్పుడు సరైన పరికరాలు లేని స్థితి నుంచి, నేడు ఒక్కో క్రీడాకారుడి కిట్ విలువ రూ. 4 లక్షల వరకు ఉండే స్థాయికి ఈ క్రీడ చేరుకుంది. 2000 సంవత్సరంలో పూర్తిస్థాయి ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌గా మారిన తర్వాత, ఐస్ హాకీలో వారి కృషి మరింత పెరిగింది.

ఐస్ హాకీని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ప్రధాన అడ్డంకి ఖర్చు.
ఐస్ రింక్ నిర్మాణం: ఒక సాధారణ రింక్ కట్టాలన్నా రూ. 15 కోట్లు ఖర్చవుతుంది. 5,000 మంది కూర్చునే ఇండోర్ స్టేడియం కావాలంటే రూ. 40-50 కోట్లు అవసరం.
కార్పొరేట్ తోడ్పాటు: రిలయన్స్, అదానీ, టాటా వంటి దిగ్గజ సంస్థలు ముందుకు వస్తే తప్ప, ఈ క్రీడ లడఖ్ దాటి మైదాన ప్రాంతాలకు విస్తరించడం కష్టమని కెప్టెన్ పార్థ్ జగ్తాప్ అభిప్రాయపడ్డారు.
బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ'
సరిహద్దులను రక్షించడమే కాకుండా, క్రీడల పట్ల లడఖ్ స్కౌట్స్ చూపిస్తున్న చొరవ అమోఘం.
మహిళా జట్టుకు అండ: గత ఏడాది నిధుల కొరతతో ఉన్న భారత మహిళా ఐస్ హాకీ జట్టుకు లడఖ్ స్కౌట్స్ చివరి నిమిషంలో ఆర్థిక సాయం అందించారు. ఫలితంగా యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో భారత మహిళలు కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు.
'స్నో లెపర్డ్స్' గా పిలవబడే ఈ సైనికులు, తుపాకీ పట్టి శత్రువును తరమడమే కాదు, హాకీ స్టిక్ పట్టి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. త్వరలోనే భారతదేశం ఐస్ హాకీలో ప్రపంచ అగ్రరాజ్యాల సరసన చేరుతుందని వారు ఆశిస్తున్నారు.