పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్రాంజ్ మెడల్ సాధించిన అనంతరం భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. హాకీ ఆటకు మరింత మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలను కోరాడు. క్రికెట్‌తో పాటు తమ మ్యాచ్‌లను కూడా చూడాలని పరోక్షంగా సూచించాడు. భారత హాకీ ఎంతో పురోగతి సాధించిందని, ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించే సత్తా ఉందని చెప్పాడు.
గురువారం జరిగిన కాంస్య పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించి వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ కాంస్య పోరులో హర్మన్‌ప్రీత్ సింగ్(29వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 10 గోల్స్ నమోదు చేసి ఈ ఒలింపిక్స్‌లోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

మా మ్యాచ్‌లను చూడండి..
భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ సైతం అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. స్పెయిన్‌కు లభించిన 9 పెనాల్టీ కార్నర్స్‌లో ఎనిమిదింటిని అద్భుతంగా అడ్డుకున్నాడు. భారత్‌కు లభించిన 6 పెనాల్టీ కార్నర్స్‌లో రెండింటిని హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్‌గా మలిచాడు. ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ సింగ్.. ముందుగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు.
ఈ సారి బంగారు పతకం సాధించలేకపోయామని, అందుకు తమను క్షమించాలని కోరాడు. 'ఓ క్రీడగా హాకీకి భారత్‌లో గొప్ప చరిత్ర ఉంది. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాం. నా విన్నపం ఒక్కటే.. దయచేసి అందరూ మాకు మద్దుతు తెలపండి. మా మ్యాచ్‌లను చూడండి. వచ్చే ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు మేం మరింత కష్టపడుతామని హామీ ఇస్తున్నాను.
మమ్మల్ని క్షమించండి..
భారత హాకీ పురోగమిస్తోంది. ప్రస్తుతం భారత హాకీ టీమ్ ఎవరినైనా ఓడించగలదు. మీ అందరికి ముందుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలిచిన తర్వాత బంగారు పతకం గెలవాలనుకున్నాం. స్వర్ణం గెలవడానికి కావాల్సింది చేశాం. కానీ మాకు అదృష్టం కలిసిరాలేదు. తల రాతను ఎవరూ మార్చలేరు.'అని హర్మన్‌ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చాడు.
52 ఏళ్ల తర్వాత..
ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ వరుసగా రెండు పతకాలు గెలవడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత్ చివరిసారిగా 1968, 1972 ఒలింపిక్స్ గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్ 2020, పారిస్ ఒలింపిక్స్ 2024 బ్రాంజ్ మెడల్స్ అందుకుంది.
తాజా పతకంతో ఒలంపిక్స్‌లో భారత హాకీ మెడల్స్ సంఖ్య 13కు చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. తాజా
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. ఇప్పటి వరకు షూటింగ్‌లో మూడు కాంస్య పతకాలు వచ్చాయి.