భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్నాడు. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్.. డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు.
నువ్వా-నేనా అన్నట్లు సాగిన 14వ రౌండ్‌లో విజయం భారత చెస్ ప్లేయర్‌నే వరించింది. ఈ రౌండ్‌లో గుకేశ్ ఒక పాయింట్ సాధించి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. చెస్ క్రీడ చరిత్రలోనే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్నవయస్కుడిగా దొమ్మరాజ్ గుకేశ్ సరికొత్త చరిత్రను లిఖించాడు.

18 ఏళ్ల 08 నెలల 14 రోజుల వయసులో గుకేశ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో కాస్పరోవ్ రికార్డ్‌ను అతను అధిగమించాడు. 1985లో కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. గత 39 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉండగా.. గుకేశ్ బద్దలు కొట్టాడు.
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్ గెలిచి రెండో ఇండియన్ ప్లేయర్‌గా గుకేశ్ నిలిచాడు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన 14వ రౌండ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్.. డింగ్ లిరెన్‌పై పైచేయి సాధించి గెలిచాడు. బుధవారమే తేలాల్సిన ఈ ఫలితం.. ప్రత్యర్థులిద్దరి హోరాహోరీ పోరుతో ఈ రోజుకు వాయిదా పడింది. సుమారు 5 గంటల పాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింట్‌ను పంచుకున్నారు.
విజయం కోసం గుకేశ్ గట్టిగానే ప్రయత్నించినా.. 32 ఏళ్ల లిరెన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ గెలిచాడు. రన్నరప్‌గా నిలిచిన 32 ఏళ్ల లిరెన్ రూ.9.75 కోట్లు అందుకున్నాడు. ఇక మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ రూ.21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి రూ.1.69 కోట్లు లభిస్తాయి. ఈ క్రమంలో మూడు గేమ్‌లు గెలిచిన గుకేశ్‌కు రూ.5.07 కోట్లు, రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మిగిలిన నగదు బహుమతిని సమానంగా పంచారు.