
నమ్మించి గొంతుకోసింది..
'సోమాలియా అంతర్యుద్ధంలో తండ్రిని కోల్పోయి బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్న నన్ను యూకేలోని చుట్టాలింటికి చేరుస్తానని ఆశచూపిందో ఓ మహిళ. అప్పుడు నా వయసు 9 ఏళ్లు. ఆమె మాటలను నమ్మిన నేను గంపెడు ఆశతో యూకేలోని మా బంధువుల చిరునామా తీసుకొని సదరు మహిళ వెంట జబూటీ వెళ్లాను. అక్కడి నుంచి అక్రమంగా యూకేకు వెళ్లాం. కానీ, సదరు మహిళ నన్ను దారుణంగా మోసం చేసింది. చుట్టాలింటికి చేర్చకపోగా.. బలవంతంగా నాతో వెట్టిచాకిరీ చేయించింది. మా బంధవుల అడ్రస్ తీసుకొని చించేసింది.

బాధను తట్టుకోలేక ఏడ్చేవాడిని..
ఆ సమయంలో నాకు ఏడుపొచ్చింది. నా చేత ఇంటిపని, తన పిల్లలకు సంబంధించిన పనులను చేయించడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో మీ కుటుంబాన్ని చూడాలనుకుంటే ఎదురు మాట్లాడవద్దని హెచ్చరించింది. దీంతో గత్యంతరం లేక నేను ఆ పనులు చేసేవాడిని. తరచూ బాధను తట్టుకోలేక బాత్రూమ్‌లో కి వెళ్లి గంటల కొద్దీ వెక్కివెక్కి ఏడ్చేవాడిని. 12ఏళ్ల వరకు నేను ఏ స్కూల్లో చేరలేదు. ఆ తర్వాత నన్ను ఫెల్థామ్ కమ్యూనిటీ కాలేజీలో 'ఇయార్-7'లో చేర్చారు. అక్కడి సిబ్బందికి నన్ను సోమాలియా శరణార్థిగా పరిచయం చేశారు. నేను ఆ స్కూల్‌కు మాసిన దుస్తులతో వెళ్లేవాడిని. నాకు చాలా తక్కువ ఇంగ్లిష్ మాత్రమే వచ్చేది. మిగిలిన విద్యార్థులంతా నాకు దూరంగా ఉండేవారు.

మా పీఈటీ సర్ కారణంగా..
నా తరపున ఎవరూ స్కూల్‌కు వచ్చేవారు కాదు. కానీ, నాలో ప్రతిభను మా ఫిజికల్ఎడ్యూకేషన్ టీచర్ అలన్ వాట్‌కన్సన్ గుర్తించారు. నాకు ఇంగ్లిష్ రాకపోయినా కేవలం క్రీడా భాషను మాత్రమే అర్థం చేసుకొంటానని గ్రహించారు. నేను కూడా దయనీయ జీవితం నుంచి బయటపడటానికి క్రీడలు ఒక్కటే మార్గమని భావించాను. నా జీవితంలోని వెట్టిచాకిరీ, మోసం వంటి చేదు గతాన్ని అలన్ సర్‌కు చెప్పాను. వెంటనే ఆయన ఓ సామాజిక సంస్థతో మాట్లాడి నన్ను వేరే సోమాలియా కుటుంబంతో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

నా పేరు మార్చి..
ఆ క్షణం నుంచి నా జీవితమే మారిపోయింది. క్రీడలపై దృష్టిపెట్టాను. 14 ఏళ్ల వయస్సులో లాత్వియాలో ఇంగ్లిష్ స్కూల్స్ రేసులో పాల్గొనడానికి పిలుపు వచ్చింది. కానీ, ప్రయాణ పత్రాలు లేవు. దీంతో అలన్ సర్ మరోసారి సాయం చేశారు. నా పేరును మహమ్మద్ ఫరాగా మార్చి బ్రిటన్ పౌరసత్వానికి దరఖాస్తు చేశారు. జులై 2000లో నాకు బ్రిటన్ పౌరసత్వం లభించింది. అప్పటి నుంచి నేను వెనక్కి చూడలేదు.'అని సర్ మోఫరా తెలిపాడు. అయితే తన అసలు పేరు హుస్సెన్ అబ్ది కహీన్ అని, బ్రిటన్ తీసుకొచ్చేందుకు సదరు మహిళ తన పేరు ముందు మహమ్మద్ చేర్చిందని మోఫరా తెలిపాడు.


Click it and Unblock the Notifications












