భారత స్టార్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. తెలుగు తేజం కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ 2.5-1.5 తేడాతో విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ఫలితాన్ని టై బ్రేకర్ ద్వారా తేల్చారు. తొలి రెండు గేమ్స్ డ్రా కావడంతో సోమవారం టై బ్రేకర్ మ్యాచ్‌లు నిర్వహించారు.
టై-బ్రేకర్స్‌లో 10 నిమిషాల వ్యవధితో కూడిన రెండు ర్యాపిడ్ గేమ్స్ నిర్వహించారు. ఈ ర్యాపిడ్ గేమ్ ప్రతీ ఎత్తుకు 10 సెకన్ల ఇంక్రిమెంట్ సమయం మాత్రమే ఉంటుంది. ట్రై బ్రేకర్‌లో మొదటి ర్యాపిడ్ గేమ్ కూడా డ్రాగా ముగిసింది. ఈ గేమ్‌లో కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ హోరీహోరీగా తలపడ్డారు. ఈ గేమ్ కూడా ఆఖరి ఎత్తు వరకు ఉత్కంఠగా సాగింది. ఈ గేమ్‌లో ఇరువురు డ్రాకు అంగీకరించారు.

రెండో ర్యాపిడ్ గేమ్‌లో దివ్య దేశ్‌ముఖ్ నల్లపావులతో ఆడి, అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ గేమ్‌లో కోనేరు హంపి ఒక కీలకమైన ఎండ్-గేమ్ పొరపాటు చేసింది. ఈ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కోనేరు హంపి ఓటమిని అంగీకరించి గేమ్ నుంచి వైదొలిగింది. హంపి చేసిన తప్పిదాలు దివ్య దేశ్‌ముఖ్‌కు కలిసొచ్చాయి.
ఈ చారిత్రక విజయంతో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకుంది. భారత మహిళా చెస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది. ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా దివ్య దేశ్‌ముఖ్ 2026లో జరిగే ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించేందుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది.
ఇద్దరు భారత చెస్ ప్లేయర్స్ ఫైనల్‌కు చేరుకోవడం, అందులో దివ్య విజయం సాధించడం భారత చెస్ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. దివ్య విజయం యువతరం ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చింది.