
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు ఇరగదీస్తున్నారు. ఖతర్నాక్ ఆటతో పతకాలు ఎత్తుకొస్తున్నారు. మంగళవారం భారత మహిళల లాన్ బౌల్స్ టీమ్ స్వర్ణ పతకం గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. లాన్‌బౌల్ మహిళల ఫోర్స్ ఈవెంట్ ఫైనల్లో లవ్లీ చౌబే (లీడ్) ఆధ్వర్యంలో, పింకీ (సెకండ్), నయన్‌మోనీ సైకియా (థర్డ్), రూపారాణీ టిర్కే (స్కిప్)తో కూడిన భారత జట్టు 17-10తో సౌతాఫ్రికాపై విజయం సాధించి పసిడి సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి.
సోమవారం జరిగిన సెమీఫైనల్లో 16-13తో న్యూజిలాండ్‌పై విజయంతో ఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్న భారత లాన్ బౌల్ టీమ్.. ఫైనల్లో అదే జోరును కొనసాగించింది. ఆరంభంలో సౌతాఫ్రికాతో గట్టి పోటీ ఎదురైనా ఏ మాత్రం తడబడకుండా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేని ఈవెంట్‌లో అంచనాలకు మించి రాణించిన భారత లాన్ బౌల్స్ టీమ్, మూడు సార్లు ఛాంపియన్ అయిన సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఆఖరి 3 రౌండ్లలో భారత జట్టు ఊహించని విధంగా కమ్‌బ్యాక్ చేసింది. 13 ఎండ్స్ ముగిసే సమయానికి 12-10, 14 ఎండ్స్ ముగిసే సమయానికి 15-10 తేడాతో ఆఖరి ఎండ్‌ని 17-10 తేడాతో ముగించి లాన్ బౌల్స్‌లో చరిత్ర సృష్టించింది.
ఈ విజయంతో భారత్ ఖాతాలో 10 పతకాలు చేరాయి. ఇందులో నాలుగు స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఇక ఇతర ఈవెంట్లలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. స్మిమ్మింగ్‌లో భారత స్విమ్మర్లు అద్వైత్ పాగే, కుసగ్ర రావత్, 1500 మీటర్ల ఈవెంట్‌లో ఫైనల్‌కి అర్హత సాధించారు. అద్వైత్ ఏడో స్థానంలో నిలిస్తే, కుసగ్ర 8వ స్థానంలో నిలిచాడు. మహిళల షార్ట్ పుట్ ఈవెంట్‌లో మన్‌ప్రీత్ కౌర్ 16.78 మీటర్ల దూరం విసిరి 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించింది...
అలాగే పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌లో పోటీపడిన మహమ్మద్ యహియా, మురళీ శ్రీశంకర్ 7.68 మీటర్లు జంప్ చేసి ఫైనల్‌కి అర్హత సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత పురుషుల జట్టు, నైజీరియాపై 3-0 తేడాతో విజయం అందుకుని, ఫైనల్‌కి దూసుకెళ్లింది.